పెళ్లి చేసుకో ఇల్లు కొనుక్కో.. బావుందయా కాన్సెప్టు!
సిద్ధార్థ్ - అదితీ రావ్ జంట పెళ్లి తర్వాత దూకుడు తగ్గించారు. వరుసగా సినిమాలు చేయడం లేదు.
By: Tupaki Desk | 29 Jun 2025 6:00 AM ISTతాను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని, సొంత ఇల్లు కొనుక్కోవాలని తన తల్లిదండ్రులు చాలా కాలంగా కోరుకున్నట్టు హీరో సిద్ధార్థ్ చెప్పాడు. ఇన్నేళ్లలో అసలు తనకు ఆస్తులు ఏవీ లేవని అన్నాడు. కనీసం ఇల్లు కూడా కొనుక్కోలేదని తెలిపాడు. అయితే అతడు చాలా కాలం వేచి చూశాక.. తన తల్లిదండ్రుల కోరిక మేరకు అందమైన సహనటి అదితీరావ్ హైదరీని ప్రేమించి పెళ్లాడాడు. చివరికి తనకు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన హైదరాబాద్ తో అనుబంధం తెగకుండా, తెలంగాణ అల్లుడు అయ్యాడు.
సిధ్- అదితీ జంట అందరికీ నచ్చింది. వారి అన్యోన్య దాంపత్యం ఇప్పుడు కొత్త జంటలకు స్ఫూర్తి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ జంట తమ కొత్త ఇంట్లోకి మారేందుకు సిద్ధమవుతోంది. పెళ్లి తర్వాత ఇప్పుడు కొత్త ఇంటిని సిధ్ కొనుక్కున్నాడు. ఈ జంట తమ డ్రీమ్ హౌస్ కొనుగోలు కోసం కోట్లాది రూపాయలు వెచ్చించారని తెలిసింది. పాతికేళ్ల సినీప్రయాణంలో ఇప్పటికి సిధ్ స్థిరపడ్డాడు. జీవితంలో సగం పైగా సినిమాకే అంకితమిచ్చాడు. అయినా ఒక్క ఆస్తి కూడా లేదని అనడం ఆశ్చర్యపరిచింది. కనీసం వంద గజాల భూమి కూడా లేదని అతడు అన్నాడు. రెండు నెలల క్రితమే సొంత ఇల్లు కొన్నాడట. తెలంగాణ అల్లుడిగా కొన్ని బాధ్యతలున్నాయని, వాటిని నెరవేరుస్తానని తెలిపాడు. నిజంగా మాది అనే నేమ్‌ప్లేట్‌తో కూడిన ఇల్లు మాకు కావాలి.. చివరికి ఆ కల నెరవేరిందని ఇప్పుడు ఈ జంట ఆనందంగా ఉంది.
సిద్ధార్థ్ - అదితీ రావ్ జంట పెళ్లి తర్వాత దూకుడు తగ్గించారు. వరుసగా సినిమాలు చేయడం లేదు. కొంత తీరిక సమయాన్ని వ్యక్తిగత ప్రైవసీ జీవితానికి కేటాయించారని అర్థమవుతోంది. తొందర్లోనే ఆ ఒక్క శుభవార్త కూడా చెబుతారని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
