సొంత గడ్డపై హింస ఇప్పటికీ వెంటాడుతూనే!
పహల్గామ్ పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని జమ్మూకు చెందిన ప్రముఖ నటుడు సిద్ధాంత్ గుప్త తన మనసులోని మాటలను పంచుకున్నారు.
By: Srikanth Kontham | 23 April 2026 10:52 PM ISTపహల్గామ్ పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని జమ్మూకు చెందిన ప్రముఖ నటుడు సిద్ధాంత్ గుప్త తన మనసులోని మాటలను పంచుకున్నారు. ఈ ఏడాది తన పుట్టినరోజు పహల్గామ్ దాడి జరిగిన మరుసటి రోజే రావడంతో ఇది తనకు ఎంతో తీపి, చేదు కలయిక అనుభూతినిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత గడ్డపై జరిగిన ఆ హింస తాలూకు జ్ఞాపకాలు ఇంకా తనను వెంటాడుతూనే ఉన్నాయన్నారు. గతేడాది ఏప్రిల్ 22న జరిగిన ఆ ఘటన పట్ల సిద్ధాంత్ స్పందిస్తూ..`ప్రస్తుతం కశ్మీర్‌లో పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంది. ఇప్పుడు కశ్మీర్ మునుపెన్నడూ లేనంత సురక్షితంగా ఉంది.
ఇటీవల మా అమ్మ కశ్మీర్ వెళ్లినప్పుడు అక్కడ తీసిన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే ఆమె ఎంతో స్వేచ్ఛగా, భయం లేకుండా ఉన్నట్లు అనిపించింది అని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటోన్న కఠిన చర్యల వల్ల అక్కడ భద్రతా భావం పెరిగిందని ఇది ఎంతో శుభపరిణామమని కొనియాడారు. భద్రత పెరిగినప్పటికీ ప్రజల మనసుల్లో ఉన్న ఆ గాయాలు అంత సులభంగా మానవి సిద్ధాంత్ గుప్త గుర్తు చేశారు. ఏళ్ల తరబడి అభద్రతా భావంతో బతికిన వారికి ప్రస్తుతం లభిస్తున్న ప్రశాంతత కొత్త ఊపిరి పోస్తుందన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించిన వారికి ఇప్పుడు దొరుకుతున్న స్వేచ్ఛ ఎంతో విలువైందనిఎమోషనల్ అయ్యారు.
కశ్మీర్ లోయలో పరిస్థితులు మరింత వేగంగా మెరుగుపడాలని ఆకాంక్షించారు. సిద్ధాంత్ తన సొంత ఊరు జమ్మూ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జమ్మూలో ఇంకా నాటక రంగం అంతగా అభివృద్ధి చెందలే దన్నారు. పాఠశాల స్థాయి నుండి పిల్లలకు కళల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. తనలాంటి ప్రతిభావంతులు తమ కలను గుర్తించడానికి ఎంతో సమయం పడుతోందని అక్కడ నాటక తరగతులు ఉంటే యువతకు ఎందో దోహదపడుతుందన్నారు. ముంబైలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తన మూలాలకు తాను మరింత దగ్గరయ్యానని సిద్ధాంత్ చెప్పుకొచ్చారు.
`మనం ఎక్కడ ఉన్నా? ఎంత ఎదిగినా? మన పుట్టిన ఊరు ఎప్పుడూ మన గుండెల్లోనే ఉంటుంది. జమ్మూ నుండి ముంబైకి వచ్చినప్పుడు అక్కడ నన్ను కట్టడి చేసిన గొంతుల నుండి పారిపోవాలని అనుకున్నాను. కానీ ఆ గొంతులను ఆ జ్ఞాపకాలను ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాతే నా జీవితం మారిపోయిందన్నారు. ఇప్పుడు తన విజయం చూసి జమ్మూలోని యువత స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నారు. సిద్ధాంత్ గుప్త మాటలు కశ్మీర్ , జమ్మూ ప్రజల మనోభావాలకు అద్దం పడుతున్నాయి. హింస నుండి శాంతి వైపు అడుగులు వేస్తోన్న కశ్మీర్‌లో భద్రత మాత్రమే కాదు. ప్రజల కళాత్మక అభివృద్ధికి కూడా పెద్దపీట వేయాలని కోరుతున్నారు.
