ప్రభాస్ కోసం పెద్దమ్మ ప్రత్యేక పూజలు
రెబల్ స్టార్ కృష్ణం రాజు భార్య శ్యామలా దేవికి తన కొడుకు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 July 2025 11:53 AM ISTరెబల్ స్టార్ కృష్ణం రాజు భార్య శ్యామలా దేవికి తన కొడుకు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే. అవకాశమొచ్చిన ప్రతీసారీ తన కొడుకును పొగుడుతూ ఉంటారామె. తాజాగా ఆమె తన కొడుకు ప్రభాస్ కోసం ప్రత్యేక పూజలు చేశారని తెలుస్తోంది. కాకినాడ జిల్లాలోని తునిలో ఉన్న తలుపులమ్మ తల్లి ఆలయాన్ని శ్యామలా దేవి దర్శించి, ప్రత్యేక పూజలు చేసి దైవాశీస్సులు పొందారు.
అయితే శ్యామలా దేవి ఇలా గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం ఏటా జరిగే సాంప్రదామేనని తెలుస్తోంది. ఇంట్లోని పెద్దలు.. తమ కొడుకులు, కూతుళ్లు మరియు బంధువుల శ్రేయస్సు కోసం సాంప్రదాయంగా నిర్వహించే కుటుంబ ఆచారంలో భాగమని అంటుంటే, మరికొందరు మాత్రం ఆమె పూజలు ప్రభాస్ కోసం చేసినవని అంటున్నారు.
కృష్ణం రాజు తమ్ముడు కొడుకే ప్రభాస్. అందుకే కృష్ణంరాజు చనిపోయాక కుటుంబం మొత్తం బాధ్యతల్ని ప్రభాస్ తన భుజాలపై వేసుకున్నారు. అయితే ఇటీవల ప్రభాస్ రెగ్యులర్ గా పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పదే పదే ప్రభాస్, మోకాలికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీని వల్లే ప్రభాస్ తాను చేస్తున్న సినిమా షూటింగుల నుంచి కూడా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందనే సంగతి తెలిసిందే.
అయితే అమ్మవారి దర్శన అనంతరం కూడా శ్యామలా దేవి మీడియాతో మాట్లాడకపోయినప్పటికీ ఆమె అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ ను చేస్తున్న ప్రభాస్ ఆ సినిమాను రిలీజ్ కు రెడీ చేయడంలో బిజీగా ఉన్నారు. హార్రర్ కామెడీ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
