Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ భార్యగా శృతి.. ఇదిగో క్లారిటీ!

ఈ చిత్రంలో మరో కథానాయికగా గుజరాతీ నటి శృతి మరాఠే నటిస్తుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   22 March 2024 3:18 PM GMT
ఎన్టీఆర్ భార్యగా శృతి.. ఇదిగో క్లారిటీ!
X

RRR చిత్రంతో గ్లోబల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో భారీ స్థాయిలో ఈ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికగా గుజరాతీ నటి శృతి మరాఠే నటిస్తుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలు నిజమేనని శృతి స్వయంగా కన్ఫర్మ్ చేసింది.

‘దేవర’ మూవీలో తారక్ భార్య పాత్రలో తాను నటిస్తానని శృతి మరాఠే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'మీరు ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నారు కదా.. దాని గురించి ఏమైనా చెప్తారా?' అని అడగ్గా.. ''నేను జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేస్తున్నాను. నేను అతని భార్యగా నటిస్తున్నానని ఇదివరకే సోషల్ మీడియాలో వెల్లడైంది. ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కానుంది'' అని శృతి చెప్పింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఉత్సాహాన్ని వ్యక్తం చేసిన ఈ బ్యూటీ.. ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపింది.

గుజరాత్ రాష్ట్రానికి చెందిన నటి శృతి మరాఠే.. హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ సినిమాలలో పాటుగా కొన్ని టెలివిజన్‌ సీరియల్స్ లలోనూ నటించింది. 2003లో టీవీ రంగంలో అడుగుపెట్టిన ఈ భామ.. 2008లో 'సనాయ్ చౌఘడే' అనే మరాఠీ చిత్రంతో బిగ్ స్క్రీన్ మీదకు వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు, సీరియల్స్ చేసుకంటూ వచ్చింది. 2016లో యాక్టర్ గౌరవ్ ఘట్నేకర్‌ని శృతి వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ కొనసాగిస్తూ, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. 'బార్డ్ ఆఫ్ బ్లడ్' వెబ్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న శృతి.. ఇప్పుడు 'దేవర' మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది.

కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ 'దేవర'. కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. తండ్రి పాత్రకు జోడీగా శృతి మరాఠే నటిస్తుండగా.. కొడుకు పాత్రకు జాన్వీ కపూర్ జంటగా నటిస్తోంది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, నరైన్, కలైయరసన్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన రెండు పాత్రల ఫస్ట్ లుక్స్, ఫస్ట్ గ్లిమ్ప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గోవా సెట్స్ నుంచి తారక్ ఫోటోని మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

'దేవర' పార్ట్-1 దసరా కానుకగా 2024 అక్టోబర్ 10న తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్. కల్యాణ్ రామ్ నందమూరి ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో రాబోతున్న ఈ యూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ అధిక మొత్తానికి సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.