Begin typing your search above and press return to search.

పెళ్లి చేసుకోవాలని లేదు, ఎందుకంటే..!

కమల్‌ హాసన్‌ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శృతి హాసన్‌ తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   11 July 2025 12:00 PM IST
పెళ్లి చేసుకోవాలని లేదు, ఎందుకంటే..!
X

కమల్‌ హాసన్‌ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శృతి హాసన్‌ తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. కెరీర్‌ సాఫీగా సాగుతున్న సమయంలోనే శృతి హాసన్‌ ప్రేమ వైపు అడుగులు వేసింది. లండన్‌కి చెందిన నటుడు మైఖేల్‌ కోర్సెల్‌లో చాలా కాలం ప్రేమలో ఉంది. కానీ ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో వివాదాలు తలెత్తడంతో విడి పోయారు. ఇండియాకు పలు సార్లు మైఖేల్‌ ను తీసుకు వచ్చిన శృతి హాసన్‌, అతడిని తన తండ్రి కమల్‌ హాసన్‌కి కూడా పరిచయం చేసింది. ఇద్దరూ కలిసి జీవితం పంచుకోవడం సాధ్యం కాదని భావించి విడి పోయారు. ప్రేమ విషయంలో శృతి హాసన్ చాలా బోల్డ్‌గా ఉంటుంది. తన ప్రేమ విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా చెబుతూనే ఉంది.

మైఖేల్‌ తో బ్రేకప్‌ తర్వాత శంతను హజారికాతో ప్రేమలో పడిన శృతి హాసన్‌ పెళ్లి వరకు వెళ్లాలి అనుకుంది. 2020లో మొదలైన వీరి ప్రేమ వ్యవహారం 2024 వరకు కొనసాగింది. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు సహజీవనం సాగించిన వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కూడా సాధ్యం కాలేదు. అందుకే ప్రేమ, పెళ్లి విషయంలో శృతి హాసన్‌ చాలా అసహనంగా ఉన్నట్లు తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు చూస్తే అర్థం అవుతుంది. ఇటీవల ఒక చిట్‌ చాట్‌లో శృతి హాసన్ మాట్లాడుతూ వివాహం చేసుకోవాలంటే ఇరువురిలోనూ నిబద్ధత, విధేయతలు ఉండాలి. కానీ ఒకరిలో మాత్రం అది ఉంటే కలిసి జీవితం ముందుకు సాగడం కష్టం అవుతుందని అంది.

ప్రస్తుతం తాను ఒంటరి జీవితంలో ఉన్నాను, ఒంటరితనం నాకు కొత్తేం కాదు, నా జీవితంలో ఎక్కువ సంవత్సరాలు ఒంటరిగానే ఉన్నాను. జీవితంలో చాలా విషయాలను ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకున్నాను. కనుక ఒంటరితనం ను ఇబ్బందిగా ఫీల్ కాను అంది. అంతే కాకుండా ఒంటరిగా ఉండటం అనేది తప్పేం కాదని కూడా శృతి హాసన్‌ చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకోవాలని ప్రస్తుతానికి లేదని, పెళ్లి చేసుకుంటే తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. సింగిల్ మదర్‌కి ఉండే కష్టాలు నాకు తెలుసు. అందుకే పెళ్లి చేసుకుని, ఏవో కారణాల వల్ల విడి పోయి సింగిల్ మదర్‌గా ఇబ్బందులు పడటం నా వల్ల కాదని శృతి హాసన్‌ చెప్పుకొచ్చింది.

ఇప్పటికే రెండు సార్లు ప్రేమ విఫలం అయిన కారణంగా శృతి హాసన్‌ పెళ్లి విషయంలోనూ అదే జరుగుతుందేమో అనే ఆందోళన పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకే పెళ్లి అంటే అవసరమా అన్నట్లుగా ఆమె భావిస్తుంది. పెళ్లి చేసుకున్న వారు ఎంతో మంది సంతోషంగా పిల్లలతో జీవితాన్ని సాగిస్తున్నారు. కొందరు విడి పోవడంతో పిల్లలు సింగిల్‌ పేరెంట్‌ చైల్డ్‌లుగా మిగులుతున్నారు. వారిని చూసిన సమయంలో శృతి హాసన్‌కి పెళ్లి పై ఆసక్తి తగ్గుతూ ఉన్నట్లు తెలుస్తోంది. శృతి హాసన్ తల్లి తండ్రి చిన్నతనంలోనే విడాకులు తీసుకున్నారు. అందుకే సింగిల్‌ పేరెంట్‌గా ఉండటం చాలా రిస్క్‌ అని, చాలా కష్టం అని శృతి హాసన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లిపై నమ్మకం ఉందని మాత్రం శృతి హాసన్ అంటుంది. భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.