Begin typing your search above and press return to search.

నా కాళ్ల‌ను నాకు వ‌దిలేయండి

సినీ ఇండ‌స్ట్రీలో సినిమా హిట్టైతే ఆ క్రెడిట్ హీరోకి, ఫ్లాపైతే ఆ క్రెడిట్ ను హీరోయిన్ పై వేసేయ‌డం చాలా కామ‌న్ గా చూస్తుంటాం.

By:  Tupaki Desk   |   26 July 2025 1:09 PM IST
నా కాళ్ల‌ను నాకు వ‌దిలేయండి
X

సినీ ఇండ‌స్ట్రీలో సినిమా హిట్టైతే ఆ క్రెడిట్ హీరోకి, ఫ్లాపైతే ఆ క్రెడిట్ ను హీరోయిన్ పై వేసేయ‌డం చాలా కామ‌న్ గా చూస్తుంటాం. తాజాగా ఈ విష‌యంపై శృతి హాస‌న్ మాట్లాడారు. లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కూతురిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాస‌న్ చాలా త‌క్కువ టైమ్ లోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుని స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు.

ప్ర‌స్తుతం శృతి హాస‌న్ న‌టించిన కూలీ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఆగ‌స్ట్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శృతి ఆమె కెరీర్ తొలినాళ్ల‌ను గుర్తు చేసుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో రెండు సినిమాలు వ‌రుస‌గా చేయ‌డం, ఆ రెండూ ఫ్లాప‌వ‌డంతో త‌న‌ను ఐరెన్ లెగ్ అన్నార‌ని గుర్తు చేసుకున్నారు.

ఆ రెండు సినిమాల్లో హీరో ఒక‌రే అయిన‌ప్ప‌టికీ ఐరెన్ లెగ్ అనే ముద్ర త‌న‌కు మాత్ర‌మే వేశార‌ని, ఆ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతారో త‌న‌కు తెలీద‌ని శృతి అన్నారు. అయితే ఆ రెండు సినిమాలూ ఫ్లాపైనా త‌న‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో న‌టించే ఛాన్స్ వ‌చ్చింద‌ని, ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింద‌ని అప్పుడు మ‌ళ్లీ గోల్డెన్ లెగ్ అన‌డం మొద‌లుపెట్టార‌ని శృతి చెప్పారు.

సినిమా విజ‌యం ఆధారంగా అలాంటివి డిసైడ్ చేయొద్ద‌ని, ఐరెన్ లెగ్, గోల్డెన్ లెగ్ అనొద్ద‌ని, త‌న కాళ్ల‌ను త‌న‌కు వ‌దిలేయ‌మ‌ని శృతి అన్నారు. త‌న‌కు ప్ర‌శంస‌లూ, విమ‌ర్శ‌లూ ఏవీ అవ‌స‌రం లేద‌ని శృతి ముక్కుసూటిగా చెప్పారు. త‌న ఫ్లాపుల‌ను ప‌ట్టించుకోకుండా త‌న‌కు గ‌బ్బ‌ర్ సింగ్ లో అవ‌కాశ‌మిచ్చినందుకు డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కు, హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. గ‌బ్బ‌ర్ సింగ్ హిట్ త‌ర్వాత త‌న కెరీర్ మారిపోయిందని శృతి తెలిపారు.