Begin typing your search above and press return to search.

సెలబ్రిటీలకు సోషల్ మీడియా వరమా.. శాపమా?

ఫ్యాన్స్‌తో నేరుగా మాట్లాడే అవకాశం కూడా సోషల్ మీడియా ద్వారానే లభిస్తోంది. ఈ యాంగిల్ లో చూస్తే సెలబ్రిటీల కెరీర్‌కు సోషల్ మీడియా నిజంగానే ఒక పెద్ద వరం.

By:  Sravani Lakshmi Srungarapu   |   4 Sept 2026 3:00 PM IST
సెలబ్రిటీలకు సోషల్ మీడియా వరమా.. శాపమా?
X

ఒకప్పుడు సినిమా ప్రమోషన్ అంటే పోస్టర్లు, టీవీ ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్లు మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా సెలబ్రిటీలకు అత్యంత ప‌వ‌ర్‌ఫుల్ ప్ర‌మోష‌న‌ల్ ప్లాట్‌ఫామ్‌గామారింది. సినిమా రిలీజ్ కు ముందు ఒక పోస్టర్ పెట్టినా, చిన్న వీడియో షేర్ చేసినా క్షణాల్లో కోట్లాది మందికి చేరుతోంది. ఫ్యాన్స్‌తో నేరుగా మాట్లాడే అవకాశం కూడా సోషల్ మీడియా ద్వారానే లభిస్తోంది. ఈ యాంగిల్ లో చూస్తే సెలబ్రిటీల కెరీర్‌కు సోషల్ మీడియా నిజంగానే ఒక పెద్ద వరం.

అయితే అదే సోషల్ మీడియా ఇప్పుడు వారికి కొత్త తలనొప్పులను కూడా తెచ్చిపెడుతోంది. ఒకప్పుడు సెలబ్రిటీ పేరు లేదా ఫొటోను ప‌ర్మిష‌న్ లేకుండా ఉపయోగించడం వరకు మాత్రమే సమస్య ఉండేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో పరిస్థితులు మ‌రింత సంక్లిష్టంగా మారాయి. ఒక నటుడు మాట్లాడని మాటలను అతని గొంతుతో చెప్పించవచ్చు. చేయని పనిని చేసినట్లు వీడియోను క్రియేట్ చేయొచ్చు. అసలు లేని అనౌన్స్‌మెంట్‌లో అతని ఫేస్ ను ఉపయోగించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో సెలబ్రిటీలకు తమ వ్యక్తిత్వాన్నే కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. నా ఫేస్ నాది.. నా గొంతు నాది.. వాటిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించే హక్కు కూడా నాదే అంటూ ఇప్పుడు సినీ ప్రముఖుల ముందుకు వస్తున్నారు. తాజాగా హీరోయిన్ శృతి హాసన్ ఈ అంశంపైనే బాంబే హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. తన పేరు, ఫేస్, వాయిస్, వ్యక్తిత్వాన్ని AI ద్వారా రూపొందించిన కంటెంట్‌లో ప‌ర్మిష‌న్ లేకుండా ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆమె న్యాయపోరాటానికి దిగారు. ఈ వ్యవహారంలో కోర్టు ఆమెకు మధ్యంతర రక్షణ కల్పించడం కూడా ఈ సమస్య తీవ్రతను మరోసారి గుర్తుచేసింది.

సోషల్ మీడియా సెలబ్రిటీలను ప్రజలకు మరింత దగ్గర చేసింది. కానీ అదే సమయంలో వారి అసలైన గుర్తింపును కూడా ప్రమాదంలోకి నెట్టింది. ప్రమోషన్ కోసం తప్పనిసరిగా ఉండాల్సిన డిజిటల్ ప్రపంచమే, ఇప్పుడు వారి ఫేస్, వాయిస్, పేరును రక్షించుకోవాల్సిన యుద్ధభూమిగా మారుతోంది. ఫ్యూచ‌ర్‌లో స్టార్‌డమ్ అంటే కేవలం ఫ్యాన్స్, సినిమాలు, ఫాలోవర్లు మాత్రమే కాకపోవచ్చు. తన అసలైన వ్యక్తిత్వాన్ని డిజిటల్ ప్రపంచంలో కాపాడుకోవడం కూడా ఒక సెలబ్రిటీకి అత్యంత కీలకమైన బాధ్యతగా మారే రోజులు దగ్గరపడుతున్నాయి. సోషల్ మీడియా నిజంగా వరమా.. లేక అదే వరం ఇప్పుడు శాపంగా మారుతోందా? అనే ప్రశ్నకు శృతి హాసన్ తాజా న్యాయపోరాటం మరో ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది.