ఏఐ డీప్‌ఫేక్‌తో శ్రుతి హాసన్‌కు షాక్.. హైకోర్టుకు హీరోయిన్!
శృతి హాసన్ తన పేరు, ఫోటోలు, వీడియోలను పర్మిషన్ లేకుండా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలతో బాంబే హైకోర్టును ఆశ్రయించడం సినీ ఇండస్ట్రీలో ఏఐ డీప్‌ఫేక్ దుర్వినియోగంపై మరో కీలక చర్చకు దారితీసింది.
By: Sravani Lakshmi Srungarapu | 3 Aug 2026 11:53 PM ISTశృతి హాసన్ తన పేరు, ఫోటోలు, వీడియోలను పర్మిషన్ లేకుండా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలతో బాంబే హైకోర్టును ఆశ్రయించడం సినీ ఇండస్ట్రీలో ఏఐ డీప్‌ఫేక్ దుర్వినియోగంపై మరో కీలక చర్చకు దారితీసింది. ముఖ్యంగా జనరేటివ్ ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా సెలబ్రిటీల ఫేసెస్ ను మార్ఫ్ చేసి తప్పుడు వీడియోలు సృష్టించడం, వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వైరల్ చేయడం, వాణిజ్య ప్రయోజనాల కోసం వారి ఇమేజ్‌ను ఉపయోగించడం వంటి అంశాలను ఆమె పిటిషన్‌లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
తనకు కొందరు నటులతో సంబంధాలున్నట్లుగా చూపిస్తూ ఏఐతో రూపొందించిన వీడియోలు ప్రచారంలోకి వచ్చాయని, కొన్ని ఫోటోలను అసభ్యకరంగా మార్ఫ్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారని శృతి కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ కంటెంట్ తన పర్సనల్ రైట్స్, పబ్లిసిటీ రైట్స్, ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని ఆమె వాదిస్తున్నట్లు తెలిస్తోంది.
ఈ వ్యవహారంలో సోషల్ మీడియా మరియు వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ల పాత్రను కూడా శృతి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, పింటరెస్ట్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లపై తన పేరుతో ప్రచారంలో ఉన్న ఫేక్, డీప్‌ఫేక్ కంటెంట్‌ను తొలగించడంతో పాటు, దాని వ్యాప్తిని అరికట్టే చర్యలు తీసుకోవాలని ఆమె కోరినట్లు సమాచారం.
ఇదే సమయంలో, తన పర్మిషన్ లేకుండా తన పేరు, ఫోటోలతో పోస్టర్లు విక్రయిస్తున్న సంస్థపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో సెలబ్రిటీల ఫోటోలను ఉపయోగించి వస్తువులను అమ్మడం కూడా పబ్లిసిటీ రైట్స్ ఉల్లంఘన కింద పరిగణించాలనే వాదన ఈ కేసులో ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇటీవలి కాలంలో భారతీయ సినీ ప్రముఖులు తమ పేరు, డిజిటల్ గుర్తింపును దుర్వినియోగం కాకుండా రక్షించేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. డీప్‌ఫేక్ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత గుర్తింపు, వాణిజ్య వినియోగ హక్కులు, డిజిటల్ భద్రత వంటి అంశాలపై న్యాయవ్యవస్థ స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. శృతి హాసన్ పిటిషన్ కూడా అదే దిశలో ఒక ముఖ్యమైన న్యాయపరమైన అడుగుగా పరిశీలించబడుతోంది.
