17కోట్లు లాభాల్లో వాటా కోరిన నటి.. చేతులెత్తేసిన నిర్మాత
బాలీవుడ్ లో దీపిక పదుకొనే, ఆలియాభట్, కత్రిన కైఫ్ లాంటి కథానాయికల హవాకు ఎదురే లేదు.
By: Tupaki Desk | 21 May 2025 12:00 AM ISTబాలీవుడ్ లో దీపిక పదుకొనే, ఆలియాభట్, కత్రిన కైఫ్ లాంటి కథానాయికల హవాకు ఎదురే లేదు. అయితే వీళ్లందరికీ చెక్ పెట్టేంత ట్యాలెంట్ అందం ఉన్న నటి శ్రద్ధా కపూర్. ప్రభాస్ సరసన `సాహో` లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించిన ఈ బ్యూటీ దక్షిణాదినా సుపరిచితం. శ్రద్ధాను పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ స్టార్ అంటే అతిశయోక్తి కాదు.
ఆషిఖి 2, సాహో, ఏబిసిడి 3, స్త్రీ, స్త్రీ 2, చిచ్చోర్ ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అంచెలంచెలుగా తన స్టార్ డమ్ ని పెంచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఒక్కో సినిమాకి భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తోంది. మడాక్ ఫిలింస్ లో స్త్రీ 2 ఘనవిజయం సాధించిన తర్వాత శ్రద్ధా తన పారితోషికాన్ని భారీగా పెంచేసిందని టాక్ వినిపిస్తోంది. ఈ భామ తన స్నేహితురాలే అయినా, ఏక్తా కపూర్ నిర్మిస్తున్న సినిమాకి భారీ పారితోషికాన్ని ఆశించింది. 17 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా ఇవ్వాలని కండీషన్ పెట్టిందట.
అయితే ఏక్తా కపూర్ అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేమని భయపడినట్టు కథనాలొస్తున్నాయి. శ్రద్ధా ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగిందని, దీంతో ఆ స్థానంలో వేరొక నటిని నటింపజేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని కథనాలొస్తున్నాయి. ఇది నాయికా ప్రధాన చిత్రం. దీనికి తుంబాద్ ఫేం అనీల్ బార్వే దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా కపూర్ నిర్ణయం అనూహ్యమైనది.
