పాపం శ్రద్ధా... విఠాబాయి కోసం చాలా కష్టం
హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోషల్ మీడియా ద్వారా కాలికి పెద్ద కట్టు కట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది.
By: Ramesh Palla | 24 Nov 2025 4:42 PM IST'ఛావా' వంటి చారిత్రాత్మక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ప్రస్తుతం మరాఠీ జానపద కళాకారిణి విఠాబాయి నారాయణ్‌గావ్‌కర్ జీవిత చరిత్ర ఆధారంగా ఛారిత్రాత్మక సినిమా 'ఈఠా' ను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో వీఠాబాయి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. గత కొన్నాళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ లేదా అటు ఇటుగా సినిమాను విడుదల చేసేందుకు గాను దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సమయంలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ కాలికి గాయం కావడంతో షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
శ్రద్దా కపూర్‌కి గాయం...
హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోషల్ మీడియా ద్వారా కాలికి పెద్ద కట్టు కట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది. దాంతో అంతా కూడా శ్రద్ధా కపూర్‌కి ఏమైంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫోటోతో పాటు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని శ్రద్ధా కపూర్ క్లారిటీ ఇచ్చింది. ఈఠా సినిమా షూటింగ్ సమయంలో తన కాలు కండరాలు ఒత్తిడికి గురి అయ్యాయి అని, ఆ సమయంలో తాను కనీసం కాలు కదపలేక పోయాను అంది. ఈ సినిమా కోసం గత కొన్ని నెలలుగా తాను దాదాపుగా 15 కేజీల బరువు పెరిగాను. దాంతో డాన్స్ చేస్తున్న సమయంలో ఇబ్బందిగా అనిపిస్తూ వచ్చింది. తాజాగా తాను లవణీ సాంగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మరింతగా ఇబ్బంది అనిపించింది. చీర కట్టుతో పాటు, చాలా బరువైన ఆభరణాలు ధరించి డాన్స్ చేయడం వల్ల చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది అని శ్రద్ధా కపూర్ ఆ పోస్ట్‌లో పేర్కొంది.
ఈఠా సినిమా పాట షూటింగ్‌లో...
ఈఠా సినిమాలో శ్రద్ధా కపూర్ ప్రముఖ కళాకారిణి విఠాబాయి పాత్రలో కనిపించబోతుంది. అందుకోసం చాలా డాన్స్ చేయాల్సి ఉంటుంది. పైగా ఈ మధ్య ఆమె బరువు పెరగడం వల్ల కూడా సమస్యలు మొదలు అయ్యాయి. సాధారణంగా బరువు ఎక్కువగా ఉండే వారు డాన్స్ చేయడానికి కష్టపడాల్సి ఉంటుంది. శ్రద్దా కపూర్ వంటి హీరోయిన్స్ సన్నగా నాజూకుగా ఉన్న సమయంలో ఎలాంటి స్టెప్స్‌ను అయినా ఈజీగా చేయగలరు. కానీ బరువు పెరగడంతో పాటు, చాలా బరువైన ఆభరణాలు ధరించి, పైగా చీర కట్టులో డాన్స్ చేయాలంటే సాధ్యం అయ్యే పని కాదు. అయినా కూడా సినిమా కోసం శ్రద్ధా ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే శ్రద్ధా కపూర్ కాలి కండరాలపై అదనపు భారం పడి తీవ్ర ఇబ్బందిని కలిగించాయట. దాంతో ఆమె అసౌకర్యంకు గురి అయిందని సెట్స్ లో ఉన్న వారు అంటున్నారు.
ఛావా సినిమా తర్వాత లక్ష్మణ్ ఉటేకర్
తనవల్ల షూటింగ్ ఆగిపోకూడదు అనే ఉద్దేశంతో కొన్ని క్లోజప్ షాట్స్, చిన్న మూమెంట్స్ తీసుకుందామని దర్శకుడు లక్ష్మణ్‌తో అన్నప్పటికీ ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న దర్శకుడు సున్నితంగా తిరస్కరించాడట. పూర్తిగా ఆరోగ్యంగా మారిన తర్వాత మాత్రమే షూటింగ్‌కు వెళ్దాం అని దర్శకుడు అన్నాడట. ప్రస్తుతం తాను కోలుకుంటున్నాను అని, తిరిగి అతి త్వరలోనే పూర్తి ఉత్సాహంతో షూటింగ్‌లో పాల్గొంటాను అనే విశ్వాసంతో శ్రద్ధా కపూర్ ఉంది. ఆమె డాన్స్ తో కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుందని ఈ గాయం చూస్తుంటే అనిపిస్తుంది అని అభిమానులతో పాటు అంతా కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఛావా వంటి సూపర్ హిట్ సినిమాను తీసిన దర్శకుడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా కనుక సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అని ఆయన సన్నిహితులు హామీ ఇస్తున్నారు.
