Begin typing your search above and press return to search.

షారుక్‌ని చూసి మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ నేర్చుకోవాల్సిందేనా?

ఆ త‌రువాత మ‌రో నాలుగేళ్లు వేచి చూసి చేసిన 'లాల్ సింగ్ చ‌డ్డా' కూడా బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా విఫ‌లం కావండ‌తో అమీర్ ఖాన్ కెరీర్ ఒక్క‌సారిగా ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిపోయింది

By:  Tupaki Desk   |   11 Oct 2023 11:30 PM GMT
షారుక్‌ని చూసి మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ నేర్చుకోవాల్సిందేనా?
X

కొంత మంది తెలియ‌క త‌ప్పులు చేస్తుంటారు. కానీ మ‌రి కొంత మంది మాత్రం తెలిసి తెలిసి మ‌ళ్లీ మ‌ళ్లీ అవే త‌ప్పులు చేస్తూ చేతులు కాల్చుకుంటుంటారు. ఇప్పుడు ఇదే పంథాలో బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ మ‌ళ్లీ త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నాడా? అంటే బాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. అమీర్‌ఖాన్ స‌క్సెస్ మాట విని చాలా ఏళ్ల‌వుతోంది. 2017లో 'సీక్రెట్ సూప‌ర్ స్టార్‌' సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నారు.

దీని త‌రువాత అమీర్ హిట్ అనే మాట విని దాదాపు ఆరేళ్ల‌వుతోంది. అమితాబ్‌తో క‌లిసి చేసిన 'థ‌గ్స్ ఆఫ్ ఇందుస్థాన్‌' డిజాస్ట‌ర్ అయింది. ఆ త‌రువాత మ‌రో నాలుగేళ్లు వేచి చూసి చేసిన 'లాల్ సింగ్ చ‌డ్డా' కూడా బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా విఫ‌లం కావండ‌తో అమీర్ ఖాన్ కెరీర్ ఒక్క‌సారిగా ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిపోయింది. హాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'ఫారెస్ట్ గంప్‌' ఆధారంగా అమీర్ ఖాన్ న‌టించిన స్వ‌యంగా నిర్మించిన ఈ సినిమా ఏ విష‌యంలోనూ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయింది.

రూ.180 కోట్ల‌తో నిర్మిస్తే బాక్సాఫీస్ వ‌ద్ద రూ.120 కోట్లు మాత్ర‌మే రాబ‌ట్టి షాక్ ఇచ్చింది. దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ అమీర్ ఖాన్ త‌దుప‌రి సినిమా విష‌యంలో ఆచితూచి అడుగులు వేయాల‌నుకుంటున్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే అమీర్ ఖాన్ మాత్రం ఊహించ‌ని షాక్ ఇవ్వ‌బోతున్నారు. మ‌ళ్లీ చేసిన త‌ప్పులే చేయ‌బోతున్నారు. మ‌రోసారి డైరెక్ట‌ర్‌గా మ‌రో ప్ర‌యోగం చేయ‌బోతున్నారు. 'సితారే జ‌మీన్ ప‌ర్‌' పేరుతో ఓ సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు.

2007లో 'తారే జ‌మీన్ ప‌ర్‌' పేరుతో అమీర్ ఖాన్ చేసిన సినిమా అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని తెచ్చి పెట్టింది. ఇటీవ‌ల 'ఫారెస్ట్ గంప్‌'ని 'లాల్ సింగ్ చ‌డ్డా' పేరుతో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న అమీర్ కాన్ మరో సారి 'సితారే జ‌మీన్ ప‌ర్‌' అంటూ మ‌రో స్పానిష్ రీమేక్‌కు శ్రీ‌కారం చుడుతుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమాకు ఆర్ ఎస్ ప్ర‌స‌న్న ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

రీమేక్‌ల‌కు కాలం చెల్లిన ఈ రోజుల్లో తెలిసి తెలిసి మ‌ళ్లీ మ‌ళ్లీ అమీర్ అవే త‌ప్పులు చేస్తుండ‌టంతో బాలీవుడ్ వ‌ర్గాలు అవాక్క‌వుతున్నాయి. క‌ష్ట‌కాలంలో స్ట్రెయిట్ క‌థ‌ల‌తో షారుక్ ఖాన్ వ‌రుస‌గా 'ప‌ఠాన్‌','జ‌వాన్‌' సినిమాల‌ని అందించి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని ద‌క్కించుకున్నాడు. త‌న‌ని చూసి అయినా అమీర్ ఖాన్ నేర్చుకోవాల‌ని నెటిజ‌న్‌లు సెటైర్లు వేస్తున్నారు.