నాకేం కావాలో నాకు బాగా తెలుసు
బాలీవుడ్‌లో పెరుగుతున్న పీఆర్ కల్చర్ గురించి ఈ మధ్య పలువురు సెలబ్రిటీలు నోరు విప్పుతున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 16 Feb 2026 7:05 PM ISTబాలీవుడ్‌లో పెరుగుతున్న పీఆర్ కల్చర్ గురించి ఈ మధ్య పలువురు సెలబ్రిటీలు నోరు విప్పుతున్నారు. బాలీవుడ్ లో పీఆర్ స్టంట్స్ ఎక్కువయ్యాయని కొందరంటుంటే, మరికొందరు ప్రతీ విషయాన్ని పీఆర్ యాంగిల్ లో చూసి నిజాలను కూడా నమ్మలేకపోతున్నారని కామెంట్స్ చేశారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు బాలీవుడ్ పీఆర్ సంస్కృతిపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్న వేళ, టాలీవుడ్ నటి, అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
శోభిత టార్గెట్ అది కాదు
ప్రస్తుతం సినీ రంగంలోని సెలబ్రిటీలు 24 గంటలూ మీడియాలో కనిపించడం, సోషల్ మీడియాలో నిరంతర ప్రచారం కొనసాగించడం, ప్రతీ చిన్న విషయాన్నీ హైలైట్ చేయించడం లాంటివి చాలా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో శోభిత మాత్రం తనకు ఆ దారిలో నడవాలనే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. తాను 24x7 కనిపించాలని అనుకోనని, తాను ఎప్పుడూ వార్తల్లో ఉండాలనుకోనని, అది తన టార్గెట్ కాదని శోభిత చెప్పారు.
పీఆర్ వల్ల వాస్తవికత దూరమయ్యే ప్రమాదం
పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ మధ్య క్లియర్ లైన్ ఉండాలని తాను అనుకుంటానని, అందుకే ఎక్కువ పీఆర్ తన వ్యక్తిత్వానికి సరిపోదని, అది వాస్తవికతను దూరం చేసే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ప్రతీ యాక్టర్‌కీ తమ తమ ప్రాధాన్యతలుంటాయని, ఎవరినీ తప్పు పట్టే ఉద్దేశం తనకు లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా చీకటిలో అనే ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శోభిత ఆ సినిమాతో నటిగా మంచి ప్రశంసలు అందుకున్నారు.
తెలుగుతో స్పెషల్ బాండింగ్
తెలుగు సినిమాలపై తనకు ప్రత్యేక అనుబంధముంటుందని చెప్పిన శోభిత, తెలుగు భాషలో నటించడం తనకు చాలా నేచురల్ గా అనిపిస్తుందని, భాషపై పట్టు లేకపోతే కొన్ని భావాలను పూర్తిగా వ్యక్తపరచలేమని, తెలుగు తన మాతృభాష కావడంతో నటించడం చాలా సులువుగా అనిపిస్తుందని, డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ప్రతీ సీన్ నూ తాను ఎంజాయ్ చేస్తానని చెప్పారు శోభిత.
ఇక తన ప్రొఫెషనల్ జర్నీ గురించి మాట్లాడుతూ, తాను నేర్చుకున్నదంతా తనకు చాలా విలువైనదని, తనకేమి కావాలో, ఏమి వద్దో, ఏది నచ్చుతుందో, ఏది నచ్చదో ఇప్పుడు స్పష్టంగా తెలుసని, కెరీర్ లో తీసుకునే ప్రతీ డెసిషన్‌కీ తన అంతరంగ స్వరం ముఖ్యమని శోభిత వివరించారు. మొత్తానిఇ బాలీవుడ్ లో పీఆర్ వ్యవస్థపై డిస్కషన్స్ జరుగుతున్న టైమ్ లో శోభిత చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారి తీశాయి. అధిక ప్రచారం కంటే నాణ్యమైన పనితీరుకే ప్రాధాన్యమివ్వాలనేదే శోభిత అభిప్రాయంగా తెలుస్తోంది.
