'కల్కి' తర్వాత శోభనకు మరో క్రేజీ ఆఫర్
తాజా సమాచారం మేరకు సీనియర్ శోభనను మరో క్రేజీ ఆఫర్ వరించింది. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రెండు భాగాల రామాయణంలో శోభనకు ఒక కీలక పాత్రను ఆఫర్ చేసారని తెలుస్తోంది.
By: Tupaki Desk | 5 July 2025 5:00 AM ISTమేటి నటి, నర్తకి శోభన ఏదైనా సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ సినిమాకి అది గౌరవాన్ని ఆకర్షణను పెంచుతుంది. కెరీర్ లో ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో నటించిన అభినయనేత్రి. ఇటీవలే కల్కి 2898 ఏడి చిత్రంలో పరిమిత నిడివి ఉన్న పాత్రలో శోభన అభినయం ఆకట్టుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో శోభన `తుదారుమ్` చిత్రంలో అద్భుత నటనతో మైమరిపించింది. రెండు దశాబ్దాల తర్వాత మోహన్ లాల్ తో తిరిగి కలిసి నటించడం చర్చనీయాంశమైంది.
తాజా సమాచారం మేరకు సీనియర్ శోభనను మరో క్రేజీ ఆఫర్ వరించింది. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రెండు భాగాల రామాయణంలో శోభనకు ఒక కీలక పాత్రను ఆఫర్ చేసారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రావణుడి తల్లి కైకాసి పాత్రను పోషించనున్నట్లు సమాచారం. హిందూ పురాణాలలో రావణుడి తల్లి కైకాసిని మాతృ భక్తి, అచంచలమైన ఆశయం రెండింటికీ చిహ్నంగా చూస్తారు. రావణుడు, కుంభకర్ణుడు, విభూషణుడు, శూర్పణకలను కన్నది కైకేసి. ఇలాంటి ఆసక్తికర పాత్రలో అవకాశం దక్కినందున, శోభన తన సోషల్ మీడియాలో `రామాయణం` గ్లింప్స్ వీడియోను షేర్ చేసి ఆనందం వ్యక్తం చేసారు. ``తరాలను తీర్చిదిద్దిన కథలో భాగం కావడం గౌరవంగా ఉంది. నమిత్ మల్హోత్రా రామాయణం, రాముడు వర్సెస్ రావణుడి అమర కథ ప్రపంచానికి స్వాగతం. ఈ అవకాశం వచ్చిందని మీతో చెప్పడం ఆనందంగా ఉంది.. ధన్యవాదాలు`` అని రాసారు ``మన నిజం... మన చరిత్ర`` అని రాస్తూ నోట్‌ను ముగించారు.
`రామాయణం` చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడి పాత్రలో యష్ నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. భారీ వీ.ఎఫ్.ఎక్స్ తో ఈ చిత్రం తెరకెక్కుతోందని టీజర్ తో అవగాహన వచ్చింది. ఈ భారీ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నందుకు శోభనకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
