నటుడు ఉపేంద్ర కర్నాటక సీఎం అయితే తప్పేంటి?
రాజకీయాలతో సినీతారల అనుబంధం ఎప్పటికీ విడదీయరానిది. ఎప్పుడూ ఒక విడదీయరాని బలమైన బంధం కొనసాగుతూనే ఉంది.
By: Sivaji Kontham | 29 May 2026 2:39 PM ISTరాజకీయాలతో సినీతారల అనుబంధం ఎప్పటికీ విడదీయరానిది. ఎప్పుడూ ఒక విడదీయరాని బలమైన బంధం కొనసాగుతూనే ఉంది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్), అటు తమిళనాడులో ఎం. జి. రామచంద్రన్ (ఎంజీఆర్), జయలలిత వంటి మహానటులు వెండితెరపై కళారంగాన్ని ఏలడమే కాకుండా.. ప్రజా క్షేత్రంలోనూ తిరుగులేని నాయకులుగా ఎదిగి రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారు. నటులుగా కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న వీరంతా రాజకీయ నాయకులుగా మారి ప్రజాసేవలో తరించారు. నాటి నుండి నేటి వరకు ఎంతో మంది నటీనటులు రాజకీయాల్లోకి ప్రవేశించి విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇటీవలే తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించారు కోలీవుడ్ దళపతి విజయ్. అతడు తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని స్థాపించ నేరుగా ప్రజల్లోకి వెళ్లారు. ఊహించని విధంగా ఎన్నికల బరిలోకి దిగిన మొదటి ప్రయత్నంలోనే ప్రజల అఖండ మద్దతుతో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా పాపులారిటీని ప్రజాబలంగా మార్చుకుని విజయ్ సాధించిన ఈ విజయం పొరుగు రాష్ట్రాల్లోని సినీ ప్రముఖుల్లో సరికొత్త రాజకీయ ఆశలను, చర్చలకు తెర తీసింది.
తమిళనాడులో విజయ్ సీఎం అయిన నేపథ్యంలో.. భవిష్యత్తులో కర్ణాటకలో కూడా ఎవరైనా ఒక నటుడు రాజకీయాలను శాసిస్తూ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? అనే ఆసక్తికరమైన ప్రశ్న ఇప్పుడు కన్నడ నాట తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కర్ణాటక పొలిటికల్ స్క్రీన్ కాస్త స్థబ్ధుగా ఉన్నప్పటికీ తనదైన విలక్షణమైన పంథా, విప్లవాత్మక ఆలోచనలతో దశాబ్దాల పాటు కన్నడ సినీరంగాన్ని ఏలిన రియల్ స్టార్ ఉపేంద్ర భవిష్యత్తులో కర్ణాటక సీఎం అయితే తప్పేం కాదనే సహచరుడి అభిప్రాయం ఆసక్తిని కలిగిస్తోంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన అగ్ర నటుడు, సెంచరీ స్టార్ శివరాజ్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలాన్ని చేకూర్చాయి.
శివరాజ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటులు ముఖానికి రంగు వేసుకుని సినిమాలో నటించినా.. ప్రజలకు సేవ చేయడానికి మాత్రం ఎప్పుడూ రంగు వేసుకోరని నిజాయితీగా ఉంటారని స్పష్టం చేశారు. సేవా కార్యక్రమాల్లో కళాకారుల మనస్తత్వం ఎప్పుడూ క్లీన్‌గా ఉంటుందని కొనియాడారు. తమిళనాడులో విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను ఎంతో సంతోషించాను.. ఆయన సీఎం కావాలని కోరుకున్నాను.. ఇప్పుడు ప్రజల మద్దతుతో విజయ్ సీఎం అయ్యారు. అలాంటప్పుడు కర్ణాటకలో ఉపేంద్రకు అంతా అండగా నిలిచి సపోర్ట్ చేయడంలో తప్పేంటి? అంటూ శివరాజ్ కుమార్ ఎదురు ప్రశ్నించారు. ఉపేంద్ర రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండడం చాలా మంచి విషయమని ఆయన ప్రశంసించారు.
ఉపేంద్ర ఇప్పటికే 2018లోనే `ఉత్తమ ప్రజాకీయ పార్టీ` (కేపీజేపీ)ని స్థాపించి సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ప్రజాస్వామ్యంలో సరికొత్త మార్పు కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తమ రాజ్ కుమార్ కుటుంబం ఎప్పటి నుంచో ప్రజాసేవలో ఉందని.. దానిని తాము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదని శివరాజ్ కుమార్ అన్నారు. అయితే తనకు మాత్రం స్వయంగా రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని తేల్చిచెప్పారు. తమిళనాడులో దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దక్షిణాది వ్యాప్తంగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. రానున్న రోజుల్లో కర్ణాటకలో ఉపేంద్ర ప్రజాకీయ పార్టీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
