విలన్ గా శివాజీకి మరో క్రేజీ ఆఫర్?
ఇంకా చెప్పాలంటే శివాజీ కామెడీ టైమింగ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ తర్వాత ఇండస్ట్రీలో శివాజీకి బ్రేక్ వచ్చింది.
By: Tupaki Desk | 10 July 2025 8:00 PM ISTఒకప్పుడు హీరోగా నటించిన శివాజీ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న సపోర్టింగ్ రోల్స్ లో నటించిన శివాజీ తర్వాత సెకండ్ హీరోగా, ఆ తర్వాత హీరోగా మారి ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే శివాజీ కామెడీ టైమింగ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ తర్వాత ఇండస్ట్రీలో శివాజీకి బ్రేక్ వచ్చింది.
మధ్యలో పాలిటిక్స్ అంటూ తిరిగారు కానీ తర్వాత దాన్నుంచి కూడా సైలెంట్ గా తప్పుకున్నారు. ఆ తర్వాత చాలా కాలానికి బిగ్ బాస్ లో కనిపించిన శివాజీ హౌస్ మొత్తానికి పెద్ద దిక్కుగా ఉండి అందరికీ మంచి సలహాలు, సూచనలు ఇస్తూ ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచారు. బిగ్ బాస్ కు వెళ్లాక శివాజీ కు క్రేజ్ బాగా పెరిగింది. బిగ్ బాస్ నుంచి వచ్చాక ఆయన 90స్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ లో నటించి మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు.
90స్ వెబ్ సిరీస్ తర్వాత రీసెంట్ గా కోర్టు సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించి అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేశారు. నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్టు సినిమాలో మంగపతి పాత్రలో నటించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేసిన శివాజీకి ఇప్పుడో బంపరాఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో శివాజీ కీలక పాత్రలో నటించనున్నారట.
అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమాలో శివాజీ క్యారెక్టర్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని, ఈ సినిమాలో కూడా శివాజీ నెగిటివ్ రోల్ లోనే కనిపించనున్నారని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివాజీ నటిస్తే మూవీ రిలీజయ్యాక ఆయన మరోసారి బిజీ అవడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.
