Begin typing your search above and press return to search.

ఒరిజినల్‌ మోనో ట్రాక్‌ తో 'శివ' రానున్నాడు

రామ్‌ గోపాల్‌ వర్మ మొదటి సినిమాగా రూపొందిన శివ సినిమాలో నాగార్జునకు జోడీగా అమల నటించింది.

By:  Tupaki Desk   |   9 Aug 2025 7:37 PM IST
ఒరిజినల్‌ మోనో ట్రాక్‌ తో శివ రానున్నాడు
X

టాలీవుడ్‌ ట్రెండ్‌ సెట్టర్‌ మూవీ 'శివ' గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. నాగార్జునను టాలీవుడ్‌ స్టార్‌గా నిలిపిన సినిమా శివ. ఇండియన్‌ సినిమాకు వర్మ వంటి గొప్ప దర్శకుడిని ఇచ్చిన సినిమా శివ అనే విషయం ఎవరూ కాదనలేని సత్యం. శివ సినిమాను వర్మ ఎలా తీశాడు, ఆ సమయంలో ఆయనకు ఉన్న అనుభవం గురించి కథలు కథలుగా వీడియోలు వస్తూ ఉంటాయి. ఇక శివ సినిమాను ఎప్పుడు థియేటర్‌ల ద్వారా విడుదల చేసినా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బుల్లి తెరపై వందల సార్లు టెలికాస్ట్‌ అయిన శివ సినిమాను ఇంకా థియేటర్ల ద్వారా రీ రిలీజ్ చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే శివ మరోసారి థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రామ్‌ గోపాల్‌ వర్మ శివ రీ రిలీజ్‌

అన్నపూర్ణ స్టూడియోకు 50 ఏళ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో శివ సినిమాను రీ రిలీజ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్టూడియో నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. అంతే కాకుండా రామ్‌ గోపాల్‌ వర్మ సైతం శివ సినిమా గురించి, రీ రిలీజ్‌కి సంబంధించిన ప్లాన్‌ గురించి మాట్లాడాడు. ఆయన ఎక్స్‌ లో వీడియోను షేర్‌ చేశాడు. ఆ వీడియోలో వర్మ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ఒక్క పాత సినిమాకు వినియోగించని అత్యాధునిక ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సౌండ్‌ ట్రాక్‌ను అద్భుతంగా మార్చినట్లుగా చెప్పుకొచ్చాడు. తప్పకుండా సినిమా ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతిని పొందే విధంగా సినిమా సౌండ్‌ ట్రాక్ ఉంటుంది అంటూ అక్కినేని ఫ్యాన్స్‌కు మాత్రమే కాకుండా సినీ ప్రేమికులకు హామీ ఇచ్చాడు.

డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో శివ సౌండ్‌

శివ సినిమా యొక్క ఒరిజినల్‌ మోనో ట్రాక్‌ ను డాల్బీ అట్మాస్‌ లోకి మార్చడం ద్వారా క్వాలిటీ మిస్ కాలేదని అన్నాడు. మొత్తం సౌండ్ ట్రాక్‌ ను మొదటి సారి తిరిగి తయారు చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అది శివ సినిమాకు చేసినట్లుగా ఆయన పేర్కొన్నాడు. డాల్బీ అట్మాస్‌ టెక్నాలజీతో సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా వర్మ ప్రకటించాడు. రీ రిలీజ్ డేట్‌ ఎప్పుడు అనేది ఇంకా అన్నపూర్ణ స్టూడియోస్ వారు అధికారికంగా ప్రకటించలేదు. కానీ అతి త్వరలోనే సినిమా రీ రిలీజ్ ఉంటుందని హడావిడి చూస్తూ ఉంటే అనిపిస్తుంది. ఇప్పటి వరకు శివను బుల్లి తెరపై, వెండి తెరపై, ఓటీటీలో చూసిన వారు సైతం బిగ్‌ స్క్రీన్‌ పై మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు.

నాగార్జున, వర్మల ఐకానిక్ మూవీ

రామ్‌ గోపాల్‌ వర్మ మొదటి సినిమాగా రూపొందిన శివ సినిమాలో నాగార్జునకు జోడీగా అమల నటించింది. ఆ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆ తర్వాత కాలంలో టాలీవుడ్‌లో టాప్‌ స్టార్స్‌గా, టాప్‌ టెక్నీషియన్స్‌గా నిలిచారు. శివ సినిమాలోని సైకిల్‌ చైన్‌ లాగే సీన్ తో పాటు, పాపతో సైకిల్‌ పై నాగార్జున వెళ్లే సీన్‌ సైతం ఇప్పటికీ ప్రేక్షకులను కుర్చీ అంచున నిలుపుతుంది అనడంలో సందేహం లేదు. అందుకే సినిమా రీ రిలీజ్ అనగానే అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ను ఎంజాయ్‌ చేసే ప్రతి ఒక్కరూ సినిమాను చూడాలి అనుకుంటున్నారు. కాస్త మంచి ప్రమోషన్‌ చేసి శివ సినిమాను 4కే డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ క్వాలిటీతో విడుదల చేస్తే తప్పకుండా మంచి ఫలితం దక్కవచ్చు అంటున్నారు.