చరణ్ కు మరోసారి క్షమాపణ చెప్పిన శిరీష్.. వివాదానికి ఎండ్ కార్డ్!
అయితే అప్పుడే క్లారిటీ కూడా ఇచ్చారు.. "ఇది వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన విషయం కాదు, స్క్రిప్ట్ సిద్ధమైతే మళ్లీ రామ్ చరణ్‌తో సినిమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం" అని అన్నారు.
By: Tupaki Desk | 2 July 2025 6:36 PM ISTరామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఫలితంపై ఇటీవల వరుస ఇంటర్వ్యూలలో చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు మరియు ఆయన సోదరుడు శిరీష్ అనుకోకుండా మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి వచ్చింది. ముఖ్యంగా శిరీష్ తన జీవితంలో మొదటిసారిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఊహించని విధంగా వైరల్ అయ్యాయి. ఆయన చెప్పిన ప్రకారం.. సినిమా ఫెయిల్ అయిన తర్వాత శంకర్, చరణ్ తమకు ఫోన్ చేయలేదని అన్నారు.
అయితే అప్పుడే క్లారిటీ కూడా ఇచ్చారు.. "ఇది వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన విషయం కాదు, స్క్రిప్ట్ సిద్ధమైతే మళ్లీ రామ్ చరణ్‌తో సినిమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం" అని అన్నారు. అయితే ఈ కామెంట్స్ మేగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. రామ్ చరణ్ అభిమానుల నుంచి నోటీస్ లు కూడా వెలువడ్డాయి. ఈ హడావుడి మధ్య దిల్ రాజు కూడా స్పందిస్తూ.. మీడియా కావాలనే ప్రతి ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ విషయాన్ని లాగుతుందని, సినిమాలు ఫెయిల్ అవ్వడం సాధారణమే అని చెప్పాడు.
తాజాగా శిరీష్ స్వయంగా స్పందించారు. "నా మాటల ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, మెగా ఫ్యాన్స్ ఎవరైనా బాధపడితే నిజంగా క్షమించండి. మా బ్యానర్‌కు మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలున్నాయి. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలతో మేము ఎన్నో సినిమాలు చేశాం. ఆ బంధం నూటికి నూరు శాతం కొనసాగుతుంది" అని అన్నారు.
"గేమ్ చేంజర్ సినిమాపై నాకు వచ్చిన బాధను మాత్రమే వ్యక్తీకరించాను. అంతేగాని చరణ్ గారి గురించి నాకు ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదు. మేము చాలా సన్నిహితంగా ఉంటాం. కానీ, రామ్ చరణ్ గారి పెద్ద మనసుతో ఆయన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను విడుదలకు అంగీకరించిన తీరు మరువలేనిది. అలాంటి మంచి మనసున్న హీరోలను మనం గౌరవించాలి. ఇకపై నా మాటలు తప్పుగా అర్థం చేసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. అభిమానులు కూడా ఈ విషయాన్ని ముగించినట్లే భావించాలి" అని శిరీష్ వివరించారు.
వాస్తవానికి ఈ వివాదం ఊహించని విధంగా పెద్దదైంది. శిరీష్ ఇప్పటికే తన ప్రకటనను విడుదల చేసినప్పటికీ, ఇప్పుడు వీడియో స్టేట్‌మెంట్ ద్వారా మరోసారి క్లారిటీ ఇచ్చారు. అభిమానులు కూడా ఈ సానుకూల మార్పును గమనించి, టాలీవుడ్‌లోని ఈ సంబంధాన్ని మరింత బలపరచాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు ఆయన క్షమాపణతో మెగా ఫ్యాన్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది.
