డ్రగ్స్ కలకలంపై మార్కో ఫేం కామెంట్
నటుడు షైన్ టామ్ చాకోపై ప్రముఖ నటి ఫిర్యాదు మాలీవుడ్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 April 2025 11:00 PM ISTనటుడు షైన్ టామ్ చాకోపై ప్రముఖ నటి ఫిర్యాదు మాలీవుడ్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మలయాళ చిత్రసీమలో దాగి ఉన్న డ్రగ్స్ సిండికేట్లు ఒక్కసారిగా ఖంగు తిన్నాయి. నటుడి అరెస్ట్, బెయిల్ తర్వాత కూడా మాలీవుడ్ లో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అంతర్గత కమిటీలు ఇప్పుడు మరింత యాక్టివ్ అయ్యి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నాయి.
అయితే ఈ వ్యవహారంలో సినీపరిశ్రమను సాఫ్ట్ టార్గెట్ చేస్తున్నారని మార్కో ఫేం ఉన్నిముకుందన్ అన్నారు. సినిమాల కారణంగానే మాదక ద్రవ్యాలు దుర్వినియోగం అవుతున్నాయని అనడం, నేరాలు పెరుగుతున్నాయని అనడం సరికాదని, అన్ని పరిశ్రమల్లోను ఇవన్నీ ఉన్నాయని అన్నారు. అయితే సినిమావాళ్లు అనగానే వెంటనే ప్రచారం పెద్దగా వస్తుందని అభిప్రాయపడ్డారు. అన్నిటికీ ఇండస్ట్రీని టార్గెట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
నటుడిపై నటి ఫిర్యాదు చేయడం పరిశ్రమ మంచికేనని కూడా ముకుందన్ అభిప్రాయం వ్యక్తం చేసారు. దీనివల్ల మునుముందు సినీ పరిశ్రమ జాగ్రత్త పడుతుందని, స్కూల్స్ సహా విద్యాసంస్థలు, ఇతరుల ప్రదేశాలలో కూడా మాదక ద్రవ్యాల విషయంలో జాగ్రత్త పడాలని ఉన్నిముకుందన్ సూచించారు. తాను చిన్నప్పటి నుంచి డ్రగ్స్ గురించి వింటున్నానని తెలిపారు. అయితే డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకోకుండా యువతరాన్ని మేల్కొలపాలని సూచించారు. నిషిద్ధ పదార్థాలు కేరళకు ఎక్కడి నుంచి ఎలా చేరుకుంటున్నాయి? పాఠశాలలకు ఎలా చేరవేస్తున్నారు? వీటికి వాహకాలుగా పని చేసేది ఎవరు? కనుగొనాలని కూడా వ్యాఖ్యానించారు.
