నటుడు షైన్ టామ్ చాకోకు పోలీసులు సమన్లు
నటుడు షైన్ టామ్ చాకో పేరు కొద్దిరోజులుగా మీడియా హెడ్ లైన్స్ లో కొస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 April 2025 11:30 AM ISTనటుడు షైన్ టామ్ చాకో పేరు కొద్దిరోజులుగా మీడియా హెడ్ లైన్స్ లో కొస్తున్న సంగతి తెలిసిందే. సహనటి విన్సీ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని మలయాళ ఫిలింఛాంబర్, క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేసిన తర్వాత అతడి పేరు వార్తల్లోకొచ్చింది. అదే సమయంలో అతడిపై నార్కోటిక్స్ అధికారులు దాడులు చేయగా,హోటల్ రూమ్ నుంచి పారిపోయాడని ఆరోపణలొచ్చాయి.
తాజాగా ఈ కేసులో కేరళలోని కొచ్చి నగర పోలీసులు షైన్ టామ్ చాకోకు సమన్లు జారీ చేశారు. ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ సమన్ల ప్రక్రియ కొనసాగిందని సమాచారం. అలాగే చాకో దొరికితే అతడిని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పోలీసులు అతడి కోసం దాదాపు 30 ప్రశ్నలతో కూడిన వివరణాత్మక ప్రశ్నాపత్రాన్ని సిద్ధం చేశారని ది హిందూ తన కథనంలో పేర్కొంది.
అతడు హోటల్ రూమ్ నుంచి అనుమానాస్పదంగా ఎందుకు పారిపోయాడు? అనేదే అధికారుల ప్రశ్న. దీనికి అతడు సరైన జవాబివ్వాల్సి ఉంది. ఇక సీసీ టీవీ ఫుటేజ్ లో అతది ముఖం స్పష్ఠంగా కనిపించకపోయినా, హోటల్ రిజిస్టర్ లో ఉన్న పేరు ఆధారంగా అతడిని పోలీసులు గుర్తించారని సమాచారం. నిజానికి అతడి రూమ్ లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లను అధికారులు కనుక్కోలేకపోయారు. కానీ అతడు పారిపోవడం అనుమానాలను రేకెత్తించింది. పోలీసులు తమ దర్యాప్తులో గత నెల రోజుల అతని కాల్ రికార్డులను కూడా సేకరించారు. పోలీసులు, నార్కోటిక్స్ అధికారులు కలిసి ఈ విచారణను సాగిస్తున్నారు. అయితే ఈ కేసులో చాకోపై అంతర్గత కమిటీకి ఫిర్యాదు చేసిన నటి విన్సీ, ఆ తర్వాత దానిని వెనక్కి తీసుకున్నారు. తాను నటుడి పేరు బహిర్గతం కాకూడదని కోరుకున్నా, అది లీకవ్వడంతో నమ్మకద్రోహానికి పాల్పడ్డారని దాంతో నిరాశ చెందానని విన్సీ తెలిపారు.
