టామ్ చాకో.. లీలలు అన్నీ ఇన్నీ కావు
సినిమా సెట్స్‌లో డ్రగ్స్ సేవించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులు ఇటీవలే అతణ్ని అరెస్ట్ కూడా చేశారు.
By: Tupaki Desk | 25 April 2025 3:54 AMషైన్ టామ్ చాకో.. గత కొన్నేళ్లలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకర్షించిన మలయాళ నటుడు. ఓటీటీల్లో అతను నటించిన కొన్ని మలయాళ సినిమాలు చూసి ఫిదా అయిపోయిన తెలుగు ప్రేక్షకులు.. తెలుగులో ‘దసరా’ చిత్రంలో చేసిన విలన్ పాత్ర చూసి మరింతగా మెచ్చారు. దీంతో అతడికి తెలగులో అవకాశాలు వరుస కట్టాయి. తక్కువ సమయంలోనే తెలుగులో దేవర, రాబిన్ హుడ్ సహా పలు చిత్రాలు చేశాడు. సైకో టైపు క్యారెక్టర్లను పండించడంలో అతడి నైపుణ్యమే వేరు.
ఐతే టామ్ చాకోలో ఎంత టాలెంట్ ఉండి ఏం లాభం? క్యారెక్టర్ పరంగా అతడి మీద చాలా మరకలున్నాయి. సహచర ఆర్టిస్టులతో తప్పుగా ప్రవర్తించడం.. స్టేజ్ మీద అతి చేయడం.. ఇంటర్వ్యూల్లో హద్దులు మీరి ప్రవర్తించడం.. ఇలా అతడితో ముడిపడ్డ వివాదాలు ఎన్నో. ఇవన్నీ చాలవన్నట్లు ఇటీవల డ్రగ్స్ కేసు మెడకు చుట్టుకుంది. సినిమా సెట్స్‌లో డ్రగ్స్ సేవించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులు ఇటీవలే అతణ్ని అరెస్ట్ కూడా చేశారు.
ఐతే ఈసారికి టామ్ చాకోను మందలించి వదిలేసిన పోలీసులు.. ఇలాంటి వ్యవహారాలు రిపీట్ కాకుండా చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కానీ టామ్ చాకో మీద విమర్శలు, ఆరోపణలు మాత్రం ఆగట్లేదు. విన్సీ సోనీ అనే అమ్మాయి ఇప్పటికే టామ్ చాకో మీద తీవ్ర ఆరోపణలు చేయగా.. తాజాగా అపర్ణ జోన్స్ అనే మరో కథానాయిక అతణ్ని టార్గెట్ చేసింది. టామ్ చాకో సినిమా షూటింగ్స్ మధ్యలో డ్రగ్స్ తీసుకుంటాడన్న ఆరోపణలు నిజమే అనే సంకేతాలను ఆమె కూడా ఇచ్చింది. ‘‘చాకో విషయంలో విన్సీ సోనీ చెప్పినవన్నీ 100 శాతం నిజాలే.
అతడు సెట్‌లో ఎప్పుడూ ఒక తెల్లటి పొడిని తింటూ ఉండేవాడు. ఎటువంటి ఆధారాలు లేకుండా అది డ్రగ్ అని చెప్పలేను. ఎందుకంటే అది గ్లూకోజ్ కూడా కావొచ్చు. అయితే అతని ప్రవర్తన గురించి మాత్రం కచ్చితంగా చెప్పగలను. చాలా అసభ్యకరం గా ఉండేది. ఎప్పుడూ సెట్‌లో తిరుగుతూనే ఉంటాడు.. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతుంటాడు. ఆ పరిసర ప్రాంతాల్లో హీరోయిన్స్ ఉంటే అతడి మాటలు మరింత అసభ్యంగా ఉండేవి. నాకు కూడా అతడి ప్రవర్తన అసౌకర్యం కలిగించింది. వెంటనే అక్కడి సిబ్బందికి చెప్పాను. దీంతో చిత్రబృందం అతడి షెడ్యూల్ కంటే ముందు నాది పూర్తి చేసింది’’ అని అపర్ణ పేర్కొంది. ఇలా రోజుకో ఆరోపణ బయటికి వస్తుండడంతో టామ్ చాకో లీలలు అన్నీ ఇన్నీ కావని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ ఆరోపణలు అతడి కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపేలా ఉన్నాయి. తెలుగులో కూడా ఇకపై అవకాశాలు రావడం కష్టమేనేమో.