Begin typing your search above and press return to search.

కావాలని చేయలేదు.. ఆమెకు సారీ చెబుతున్నా : 'దసర' విలన్

'దసర' సినిమాతో మలయాళ స్టార్ నటుడు షైన్‌ టామ్‌ చాకో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

By:  Tupaki Desk   |   9 July 2025 11:52 AM IST
కావాలని చేయలేదు.. ఆమెకు సారీ చెబుతున్నా : దసర విలన్
X

'దసర' సినిమాతో మలయాళ స్టార్ నటుడు షైన్‌ టామ్‌ చాకో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, ఆయన కొంతకాలంగా ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. గతంలో షైన్ టామ్ తనతో అనుచితంగా ప్రవర్తించాడంటూ నటి విన్సీ సోనీ అలోషియస్‌ ఆరోపించారు. సినిమా సెట్స్ లో ఆయన డ్రగ్స్ వాడతారని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని విన్సీ మలయాళ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. అప్పట్నుంచి ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపి్గా మారింది.

అయితే ఈ వివాదానికి తాజాగా ఎండ్ కార్డ్ పడింది. నటి విన్సీకి షైన్ టామ్ క్షమాపణలు చెప్పారు. అటు విన్సీ కూడా ఈ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తమ ఇద్దరి మధ్య వివాదం సమసిపోయిందని చెప్పుకొచ్చారు. విన్సీ- షైన్ టామ్ కలిసి రీసెంట్గా నటించిన సినిమా 'సూత్రప్రాయం'. ఇది జులై 11న గ్రాండ్గా రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో విన్సీ, షైన్ టామ్ ఇద్దరూ కలిసి తాజాగా ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. ఈ సమావేశంలో విన్సీకి సారీ చెప్పి వివాదానికి ముగింపు పలికారు షైన్ టామ్. అలాగే షైన్ టామ్ పై ప్రస్తుతం తనకు ఎంతో గౌరవం ఉందని విన్సీ తెలిపారు. అలాగే అతడిపై తన వైఖరిని స్పష్టం చేశారు.

నేను నటిని కావాలనుకుంటున్నానని మొదట చెప్పింది షైన్ టామ్కే. ఆయన జర్నీ నా కెరీర్ పై ఎంతో ప్రభావం చూపించింది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యా. అలాగే గతంలో తనపై ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, తాను అలా ప్రవర్తిస్తారని అనుకోలేదని తాజా ప్రెస్మీట్లో విన్సీ చెప్పారు.

విన్సీ అలా చెప్పడంతో షైన్ టామ్ వెంటనే స్పందించారు. జరిగిన దానికి ఆయన సారీ చెబుతున్నానని అన్నారు. "నీకు ఇబ్బంది కలిగి ఉంటే క్షమించు. నీకు సారీ చెబుతున్నా. అది కావాలని చేసిందైతే కాదు. నేను సరదాగా చెప్పాను. అంతేకానీ ఎలాంటి హాని తలపెట్టాలని కాదు. విన్సీ కూడా సీరియస్ అవ్వడానికి కారణం ఉంది. ఆమెను ఎవరో ప్రోత్సహించారు"అని చాకో అన్నారు.

ఆయన పక్కనే ఉన్న విన్సీ కూడా ఈ కాంట్రవర్సీపై మాట్లాడారు. "అప్పడు నాకు ఇబ్బంది కలిగింది వాస్తవం. ఆయన నుంచి అలాంటి ప్రవర్తన నేను అస్సలు ఊహించలేదు. అలాగే నేను స్పందించిన తీరు ఆయన ఫ్యామిలీని కూడా బాధించింది. అయితే ఆ వివాదం ఇప్పుడు లేదు. ఆయనపై గౌరవం ఇప్పుడు పెరిగింది. తనలో మార్పు కనిపిస్తుంది" అని విన్సీ చెప్పుకొచ్చారు.

కాగా, ఇటీవలే షైన్ టామ్‌పై మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణలతో భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇక గతనెల 6న కుటుంబంతో కలిసి బెంగళూరుకు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన తండ్రి సీపీ చాకో అక్కడికక్కడే మృతి చెందారు.