బాధతో జీవితంపై విరక్తి కలిగింది
ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా చలామణి అయిన శిల్పా శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Tupaki Desk | 19 July 2025 5:00 AM ISTఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా చలామణి అయిన శిల్పా శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమత్రా శిరోద్కర్ చెల్లెలే శిల్పా శిరోద్కర్. నమ్రత లానే శిల్పా కూడా ఎన్నో సినిమాలు చేశారు. కానీ తెలుగులో మాత్రం బ్రహ్మ అనే సినిమా మాత్రమే చేశారు శిల్పా. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పిన శిల్పా కొన్నేళ్ల పాటూ న్యూజిలాండ్ లో సెటిలయ్యారు.
2010 తర్వాత మళ్లీ శిల్పా శిరోద్కర్ ఇండియాకు వచ్చి ఇక్కడే పూర్తిగా సెటిలవడంతో శిల్పా మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని, అందుకే న్యూజిలాండ్ నుంచి మళ్లీ ఇండియాకు మకాం మార్చారని ఎన్నో రకాల వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాను న్యూజిలాండ్ నుంచి ఇండియాకు రావడానికి గల కారణాన్ని వెల్లడిస్తూ తాను ఇండియాకు వచ్చింది సినిమా ఛాన్సుల కోసం కాదని క్లారిటీ ఇచ్చారు.
అసలు మళ్లీ సినిమాల్లో నటించాలనే ఆలోచనే తనకు లేదని, ఇండియాకు తిరిగొచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు తానెవరినీ వర్క్ కోసం అడగలేదని, ఎలాంటి ఫోటోషూట్లు కానీ, వార్తల్లో నిలవడానికి పీఆర్ స్టంట్స్ కానీ చేసింది లేదని ఆమె అన్నారు. తన తల్లీ, తండ్రీ తక్కువ గ్యాప్ లోనే తనకు దూరమవడంతో తనకు మిగిలి ఉన్న అక్క(నమ్రత)కు అయినా దగ్గరగా ఉండాలనే ఆలోచనతోనే ఇండియాకు తిరిగొచ్చినట్టు శిల్పా చెప్పారు.
అమ్మానాన్న దూరమయ్యాక ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేదాన్నని చెప్పిన శిల్పా, వారి మరణం తనను పూర్తిగా మార్చేసిందని, ఎంత ట్రై చేసినా కన్నీళ్లు ఆగేవి కాదని, ఆ టైమ్ లోనే బరువు పెరిగానని, ఇంట్లో ఎవరితోనూ సరిగా మాట్లాడేదాన్ని కాదని, ఒక్కోసారి జీవితంపై విరక్తి వచ్చి తలను గోడకేసి బాదుకోవాలనిపించేదని డాక్టర్ ను కలిసి యాంటీ డ్రిపెషన్ కోసం ట్రీట్‌మెంట్ తీసుకున్నట్టు శిల్పా వెల్లడించారు.
ఆ టైమ్ లో తన కూతురిపై, భర్తపై ఊరికే అరిచేదాన్నని, ఒక్కోసారి కోపంతో కూతురిని కొట్టినట్టు కూడా శిల్పా తెలిపారు. ఎవరితో ఎలా ఉన్నా అక్కతో మాత్రం బాగా మాట్లాడేదాన్నని దానికి కారణం ఆమె మాత్రమే తనను బాగా అర్థం చేసుకునేవారని, తనకు దగ్గరగా ఉండటానికే ఇండియాకు వచ్చేయాలనుకున్నానని, ఇండియా వచ్చే టైమ్ కు తన భర్త ఉద్యోగ రీత్యా మంచి పొజిషన్ లో ఉన్నప్పటికీ, తన కూతురికి ఆ స్కూల్ తో పాటూ ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా అలవాటైనప్పటికీ అవన్నీ వదిలేసి ఇండియాకు వచ్చినట్టు శిల్పా శిరోద్కర్ వెల్లడించారు.
