విదేశీయులతో శిల్పాశెట్టి భర్త గొడవకు కారణం?
అయితే అంతా సద్ధుమణిగింది అనుకుంటుండగానే, విదేశీయులతో రాజ్ కుంద్రా ఘర్షణ కారణంగా మరోసారి వార్తల్లోకి వచ్చారు.
By: Tupaki Desk | 12 Jun 2025 9:57 AM ISTసాగర కన్య శిల్పాశెట్టి, ఆమె భర్త ఇటీవల కొన్ని వివాదాల కారణంగా వార్తల్లో నిలిచారు. అయితే అంతా సద్ధుమణిగింది అనుకుంటుండగానే, విదేశీయులతో రాజ్ కుంద్రా ఘర్షణ కారణంగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. కుంద్రా - శిల్పాశెట్టి జంట క్రొయేషియా పర్యటనలో ఈ వివాదం తలెత్తింది. ఈ వివాదానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో జోరుగా వైరల్ అయింది. అయితే ఈ వివాదానికి కారణమేమిటి? అన్నది ఆరా తీస్తే కుంద్రా చెప్పిన సంగతులు ఆశ్చర్యపరిచాయి.
నేను నా భార్య 50వ పుట్టినరోజు కోసం ఘనంగా ప్లాన్ చేసుకున్నాను. శిల్పా, కొందరు అతిథులతో క్రొయేషియాలోని హోటల్ లో టేబుల్ ను చాలా ముందుగా(సంవత్సరం క్రితం) బుక్ చేసుకున్నాను. కానీ ఏజెంట్ కారణంగా డబుల్ బుక్ అయింది. అదే టేబుల్ ని వేరొకరు బుక్ చేసుకున్నారు. దీంతో మా మధ్య ఘర్షణ మొదలైంది! అని రాజ్ కుంద్రా చెప్పారు. అంతేకాదు.. ఇలా జరగడానికి కారణాన్ని ప్రశ్నించగా, వారు `వెయిట్ చేయండి` అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చారని, దీంతో నిరాశ మరింత పెరిగిందని కుంద్రా వాపోయాడు.
నేను నా భార్య, పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు, అత్తగారు సహా 20 మంది అతిథులతో ఆ హోటల్ వద్ద వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎదురు చూస్తూ విసిగిపోయాము.. ఏజెంట్ తప్పిదాన్ని ప్రశ్నించాను.. అని రాజ్ కుంద్రా వెల్లడించాడు. కుటుంబం అతిథులతో ఆనందంగా జరగాల్సిన కార్యక్రమం తీవ్ర ఒత్తిడిని పెంచిందని కుంద్రా అన్నారు.
బిజినెస్ మేన్ రాజ్ కుంద్రా వ్యాపారాల్లో తలమునకలుగా ఉన్నా కానీ, అతడు ఫ్యామిలీ మ్యాన్. కుటుంబానికి తగిన సమయం కేటాయించడానికి వెనకాడరు. ఇంతకుముందు పలు కోర్టు వివాదాల్లో శిల్పాశెట్టి తన భర్త కుంద్రాకు బలమైన అండగా నిలిచింది. ప్రస్తుతం క్రొయేషియాలో వెకేషన్ నుంచి శిల్పాశెట్టి ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుండగా అవి వైరల్ గా మారాయి.
