సినిమా లెక్కలు మారాయంటూ శిల్పాశెట్టి!
అందుకే పిల్లలు థియేటర్‌కు వెళ్లి తన సినిమాను చూసేలా పూర్తి స్థాయి థియేట్రికల్ రిలీజ్ అయ్యే మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
By: Srikanth Kontham | 8 Jun 2026 10:00 PM ISTప్రేక్షకులు థియేటర్లో కూర్చుని సినిమా చూడటం కంటే? కుటుంబమంతా ఓటీటీలో లీనమైపోవడం వంటి కారణాల వల్ల సినిమా నిర్మాణ రంగంలో సరికొత్త ఆర్థిక సమీకరణాలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై సీనియర్ నటి శిల్పా శెట్టి కుంద్రా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత తరుణంలో చిత్ర నిర్మాతలు థియేట్రికల్ విడుదల విషయంలో మునుపటిలా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరని అభి ప్రాయపడ్డారు. సినిమా నిర్మాణ వ్యయం పూర్తిగా మారిపోవడంతో ఇండస్ట్రీ ప్రస్తుతం కొంత స్తబ్ధతను ఎదుర్కొంటోందని విశ్లేషించారు.
థియేటర్లలో సినిమాను విడుదల చేసి నష్టపోయే బాధ్యతను మోయడం కంటే నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లతో ఒప్పందాలు చేసుకోవడానికే మేకర్స్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈ విషయంలో తానేమీ నిర్మాతలను తప్పుబట్టడం లేదని ఎందుకంటే ఒక సినిమాను నిర్మించడానికి అయ్యే ఖర్చులు, లాభనష్టాల లెక్కలు ఈ రోజుల్లో భారీగా మారిపోయాయని సమర్థించారు. పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న శిల్పా శెట్టి.. చలనచిత్రాలు, టెలివిజన్ షోలు , వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు.
కెరీర్‌లో ఈ దశకు చేరుకున్నాక స్క్రీన్‌పై ఉనికిని సమర్థించుకునే ప్రాజెక్టులపైనే పూర్తి దృష్టి పెట్టినట్లు తెలిపారు. తాను ఇప్పటి వరకు ఎన్నో రకాల పాత్రలు చేసేశానని, కాబట్టి ఇకపై కథల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనుకుంటున్నారు . అయితే పిల్లల కోసం ఓ విలక్షణమైన కోరికను వ్యక్తపరిచారు. పిల్లలు తనను ఇప్పటి వరకు వెండితెరపై చూడలేదనే విషయాన్ని శిల్ప ఈ సందర్భంగా పంచుకున్నారు. శిల్పా శెట్టి నటించిన `సుఖీ` చిత్రాన్ని ఆమె కుమారుడు ఒక ప్రివ్యూ థియేటర్‌లో మాత్రమే చూశాడని సాధారణ ప్రేక్షకుల మధ్య థియేటర్‌లో చూసే అనుభూతి దక్కలేదని గుర్తుచేశారు.
అందుకే పిల్లలు థియేటర్‌కు వెళ్లి తన సినిమాను చూసేలా పూర్తి స్థాయి థియేట్రికల్ రిలీజ్ అయ్యే మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. గతం తరహాలో సినిమా వైభవం మళ్లీ రావాలని కోరు కున్నారు. `సుఖీ` చిత్రం విడుదలైన సమయంలో ఆ సినిమాకు తగినన్ని థియేటర్లు దక్కలేదని, అది ఆ చిత్రానికి జరిగిన అన్యాయమని శిల్ప ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల ఒక మంచి ప్రయో జనం ఉందని ప్రేక్షకులు తమకు నచ్చిన సమయంలో ఓటీటీలో అలాంటి సినిమాలను ఆదరిస్తారని చెప్పారు.
ప్రస్తుతం శిల్పాశెట్టి `మా హై నా` అనే వంటల రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ ఏడాది వృత్తిపరంగా మరిన్ని కొత్త ప్రాజెక్టులకు కమిట్ అవుతాననన్నారు. సినిమాలో పాత్ర నిడివి ఎంత అన్నది తనకు ఎప్పుడూ ప్రాధాన్యత కాదని, ప్రాజెక్ట్ విశిష్టత మాత్రమే ముఖ్యమని స్పష్టం చేశారు. కెరీర్‌లో కొన్ని పెద్ద చిత్రాలను కూడా తిరస్కరించానని.. దానికి గల కారణాలు పూర్తిగా తన వ్యక్తిగతమని వాటిని నిర్మాతలతోనే ముగించడమే మంచిదని శిల్పా శెట్టి వ్యాఖ్యానించారు. తీసుకున్న ఏ నిర్ణయాలకైనా తానెప్పుడూ పశ్చాత్తాపపడనని ధీమా వ్యక్తం చేసారు .
