శేఖర్ కమ్ములకు 'కుబేర' బిగ్ టెస్ట్!
కంటెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమా ప్రేక్షకుల్ని తప్పుకుండా ఆకట్టుకుంటుందని రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
By: Tupaki Desk | 16 Jun 2025 8:00 PM ISTసెన్సిబుల్ చిత్రాల దర్శకుడిగా శేఖర్ కమ్ములకు మంచి పేరుంది. ప్రస్తుతం తమిళ స్టార్ ధనుష్ హీరోగా ఆయన తెరకెక్కించిన మూవీ 'కుబేర'. నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించింది. ఓ బిచ్చగాడికి, అపర కుబేరుడికి మధ్య సాగే ఆసక్తికరమైన కథతో శేఖర్ కమ్ముల ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే విడుదలై టీజర్, ట్రైలర్‌లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. బిజినెస్ పరంగానూ రిలీజ్‌కు ముందే మంచి లాభాల్ని దక్కించుకుంది.
కంటెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమా ప్రేక్షకుల్ని తప్పుకుండా ఆకట్టుకుంటుందని రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ మూవీని మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. డాటర్ డ్రీమ్స్ నుంచి ఇంత వరకు శేఖర్ కమ్ముల చేసిన సినిమాలన్నీ ఫీల్ గుడ్ మూవీసే. 'లవ్ స్టోరీ' సినిమా వరకు శేఖర్ కమ్ముల చేసిన సినిమాలన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ మూవీసే. `ఫిదా`ని రూ.13 కోట్లతో తీసిన శేఖర్ కమ్ముల `లవ్ స్టోరీ`కి మాత్రం తన పంథాకు భిన్నంగా రూ.30 కోట్ల వరకు ఖర్చు పెట్టించారని వార్తలు వినిపించాయి.
అయితే 'కుబేర' మాత్రం అలా కాదు. శేఖర్ కమ్ముల బడ్జెట్ స్కూల్‌కు భిన్నంగా భారీ బడ్జెట్‌తో ఈ మూవీని చేశారు. కమర్షియల్ బ్లాక్ బస్టర్లకు సమాంతరంగా హిట్‌లని దక్కించుకుంటూ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌లని రూపొందించి దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాని మాత్రం తన పంథాకు పూర్తి భిన్నంగా భారీ కమర్షియల్ సినిమాల తరహాలో రూపొందించాడు. ఈ సినిమా కోసం వంద కోట్లకు పైనే ఖర్చు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
కొన్నేళ్ల క్రితం శేఖర్ కమ్ముల 'కహానీ' మూవీని నయనతారతో 'అనామిక'గా రీమేక్ చేయడం తెలిసిందే. విమర్శలకు ప్రశంసలు దక్కించుకున్నా ఈ సినిమా కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ అనిపించుకోలేకపోయింది. ఈ సినిమాతో తెలుగులో ప్రవేశించాలనుకున్న వయాకామ్ 18 సంస్థకు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే శేఖర్ కమ్ముల తొలిసారి సాహసం చేసిన భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్ `కుబేర` హాట్ టాపిక్ గా మారింది. తొలి సారి భారీ బడ్జెట్‌తో చేసిన ఈ సినిమా దర్శకుడిగా శేఖర్ కమ్ములకు బిగ్ టెస్ట్ అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
