కాంటాలాగా గర్ల్ డెత్ మిస్టరీపై రిపోర్ట్ రెడీ!
కాంటాలాగా గర్ల్ షెఫాలి జరివాలా మృతి కేసులో తుది నివేదికలు ఈ సోమవారం నాటికి సిద్ధం కానున్నాయని తెలుస్తోంది.
By: Tupaki Desk | 30 Jun 2025 12:29 AM ISTకాంటాలాగా గర్ల్ షెఫాలి జరివాలా మృతి కేసులో తుది నివేదికలు ఈ సోమవారం నాటికి సిద్ధం కానున్నాయని తెలుస్తోంది. మొత్తం 14 స్టేట్‌మెంట్‌లు నమోదు చేసిన పోలీసులు, షెఫాలి ఇంటి సిసిటివి ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక రేపు విడుదల కానుందని సోర్స్ చెబుతోంది.
ఎన్డీటీవీ సోర్స్ ప్రకారం...షెఫాలి జరివాలా ఆకస్మిక మరణంపై అత్యంత వేగంగా దర్యాప్తు కొనసాగుతోంది. అంబోలి పోలీస్ స్టేషన్ నుండి రెండు బృందాలు కేసును డీల్ చేస్తున్నాయి. షెఫాలి పోస్ట్‌మార్టం కూపర్ హాస్పిటల్‌లో నిర్వహించారు. పోస్ట్‌మార్టం వీడియో రికార్డ్ అయిందని అధికారులు తెలిపారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ఐదుగురు సభ్యుల వైద్య బృందం పోస్ట్ మార్టమ్ రిపోర్టును తయారు చేస్తున్నారు. ప్రాథమిక నివేదిక సోమవారం వచ్చే అవకాశం ఉందని అంబోలి పోలీసులు తెలిపారు. ప్రారంభంలో ఫుడ్ పాయిజనింగ్ అనుమానంతో కేసును పరిశీలించారు. తరువాత షెఫాలి ఏదైనా విషప్రయోగం కారణంగా మరణించి ఉండవచ్చా? అనే కోణంలో దర్యాప్తు సాగింది. పోలీసులు ఇప్పుడు షెఫాలి వైద్య- మెడికేషన్ చరిత్రను పరిశీలిస్తున్నారు. గత 8 సంవత్సరాలలో షెఫాలి ఏ వైద్యులతో సంబంధం కలిగి ఉంది? ఆమెకు ఏ మందులు రాశారు? వైద్యుడిని సంప్రదించకుండా ఆమె స్వయంగా ఏవైనా మందులు తీసుకున్నారా? అనే దానిపై దర్యాప్తు జరుగుతోందని వార్తా చానెల్ తన కథనంలో పేర్కొంది.
ఇప్పటివరకు పోలీసులు ఏడు సిసిటివి ఫుటేజ్ నమూనాలను సేకరించి, కుటుంబ సభ్యులు, ఇంటి సిబ్బంది షెఫాలితో క్రమం తప్పకుండా సంభాషించిన వారు సహా 14 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు. షెఫాలి, ఆమె కుటుంబం మందులు కొనుగోలు చేసే మెడికల్ స్టోర్ ఫార్మసిస్ట్ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రాథమిక వైద్య పరీక్ష రిపోర్ట్ లీకుల ప్రకారం.. ``షెఫాలి కి లో-బీపీ, గుండెపోటు, భారీ గ్యాస్ట్రిక్ కారణంగా మరణం సంభవించి ఉండొచ్చ``ని చెబుతున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక అధికారికంగా విడుదలైన తర్వాత మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. శనివారం సాయంత్రం ఓషివారా శ్మశానవాటికలో షెఫాలిని దహనం చేశారు. పరాగ్ త్యాగి ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, చాలామంది టెలివిజన్ ప్రముఖులు నివాళులర్పించారు. గాయని సునిధి చౌహాన్ కూడా సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు. పరాస్ ఛబ్రా, హిందూస్థానీ భావు, షెహ్నాజ్ గిల్, వికాస్ గుప్తా తదితరులు షెఫాలి ఇంట్లో కనిపించారు.
