Begin typing your search above and press return to search.

'కాంటాలాగా గ‌ర్ల్' డెత్ ఇంకా మిస్ట‌రీనే: పోలీసులు

తాజాగా ఓ ప్ర‌క‌ట‌న‌లో షెఫాలి మరణానికి గల కారణం ఇంకా నిర్ధారించలేద‌ని ముంబై పోలీసులు తెలిపారు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 10:45 AM IST
కాంటాలాగా గ‌ర్ల్ డెత్ ఇంకా మిస్ట‌రీనే: పోలీసులు
X

నటి కం మోడల్ 'కాంటాలాగా' ఫేం షెఫాలి జరివాలా (42) ఆక‌స్మిక మృతి అభిమానులను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసిన సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టిలాగే ఈ మ‌ర‌ణం వెన‌క ఏదైనా మిస్ట‌రీ దాగి ఉందా? అంటూ అంద‌రికీ అనుమానాలు క‌లిగాయి. మొద‌ట‌గా ఆమె భ‌ర్త దీనికి కార‌ణ‌మా? అంటూ చాలా మీడియాలు నిరాధార క‌థ‌నాలు అల్లాయి. కొంద‌రు గుండె పోటుతో షెఫాలి మ‌ర‌ణించార‌ని రాసారు. అయితే ఈ మ‌ర‌ణం వెన‌క కార‌ణ‌మేమిటో పోలీసులు తేల్చాల్సి ఉంది. పోస్ట్ మార్ట‌మ్ నివేదిక వ‌చ్చే వర‌కూ ఈ మ‌ర‌ణం వెన‌క మిస్ట‌రీ తేల‌ద‌ని పోలీసులు చెబుతున్నారు.

తాజాగా ఓ ప్ర‌క‌ట‌న‌లో షెఫాలి మరణానికి గల కారణం ఇంకా నిర్ధారించలేద‌ని ముంబై పోలీసులు తెలిపారు. త‌న‌కు గుండెపోటు వచ్చిందని గతంలో క‌థ‌నాలొచ్చినా, ఈ మరణానికి క‌చ్చితమైన కారణం అస్పష్టంగానే ఉందని పోలీసులు చెప్పారు. ఆమె మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం పంపారు.

ఆమె ఎలా మ‌ర‌ణించింది? అంటే... అంధేరిలోని త‌న‌ నివాసంలో షెఫాలి విగ‌త జీవిగా మారింది. తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారుల బృందం ఆమె నివాసాన్ని సందర్శించారు. ప్ర‌స్తుతం పూర్తి దర్యాప్తు జరుగుతోంది. అయితే కుటుంబ సభ్యులు నిన్న మిడ్ నైట్ లో షెఫాలీని ఆసుపత్రికి త‌ర‌లించారు. అక్కడి స్టాఫ్ తో పాటు, వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. ఆ త‌ర్వాత ఒంటి గంట‌కు ముంబై పోలీసులకు సమాచారం అందింది. ప్ర‌స్తుతం కూపర్ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం చేస్తున్నారు. మరణానికి కారణం ఇంకా స్పష్టంగా తెలీదని పోలీసులు చెప్పారు.

అస్వ‌స్థ‌త‌కు గురైన షెఫాలిని ఆమె భర్త పరాగ్ త్యాగి, మరో ముగ్గురు బెల్లేవ్ వ్యూ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే ఆసుపత్రి రిసెప్షన్ సిబ్బంది ఆమె ఆసుపత్రికి చేరుకునే లోపే మరణించినట్లు నిర్ధారించిన‌ట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో వైర‌లైన‌ వీడియోల‌లో పరాగ్ త్యాగి ఆసుపత్రి నుండి బయటకు వెళుతూ వణుకుతూ.. పాక్షికంగా ముఖం కప్పుకుని క‌నిపించారు. అత‌డు కారులో ఆవరణ నుండి బయటకు వెళ్తుండగా ముఖంలో దుఃఖం స్పష్టంగా కనిపించిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి.