షష్టిపూర్తి ఒక ఎమోషనల్ ఫ్యామిలీ సినిమా: హీరో రూపేష్
ఈ సినిమాలో సంగీతం మరో హైలైట్. సంగీత దిగ్గజం ఇళయరాజా అందించిన బాణీలు ఇప్పటికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
By: Tupaki Desk | 28 May 2025 12:25 AM ISTప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం షష్టిపూర్తి ఈ నెల 30న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ తండ్రి, కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగ సంబంధాలను, కుటుంబ విలువలను చక్కగా చూపించే ఈ సినిమా సెంటిమెంట్, ప్రేమ, అనుబంధాల మేళవింపుతో సాగనుంది. ఈ సినిమాకు దర్శకుడిగా పవన్ ప్రభా పరిచయమవుతుండగా, హీరోగా రూపేష్ నటించడమే కాకుండా, నిర్మాతగానూ వ్యవహరించారు.
ఈ సినిమా విషయంలో రూపేష్ తన పర్సనల్ బాండింగ్ ను షేర్ చేసుకున్నారు. మొదట ఈ కథలో తనకున్న పాత్రకు కొత్త నటుడిని తీసుకుందామనుకున్నప్పటికి, స్క్రిప్ట్ చదివిన తరువాత తనకే ఆ పాత్ర బాగా సూటవుతుందని భావించి స్వయంగా నటించేందుకు ముందుకు వచ్చారు. నిర్మాతగా మాత్రమే కాదు, నటుడిగా తనలోని భావోద్వేగాలను వ్యక్తీకరించడంలో వచ్చిన అనుభవం మరింత సంతృప్తినిచ్చిందని చెప్పారు. ఇది కేవలం కథకు అనుబంధంగా తీసిన సినిమా కాదు, ప్రతి కుటుంబంలో ఎదురయ్యే అనుభూతులను తాకేలా రూపొందించబడి ఉండడం విశేషం.
ఈ సినిమాలో సంగీతం మరో హైలైట్. సంగీత దిగ్గజం ఇళయరాజా అందించిన బాణీలు ఇప్పటికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కథలో ఉన్న భిన్న భావోద్వేగాలకు అనుగుణంగా ఒక్కో పాటకు వేర్వేరు వర్షన్లు రూపొందించడం విశేషం. ఈ అపూర్వమైన మ్యూజిక్ కోలాబరేషన్‌కి సాహిత్యరచయిత చైతన్య ప్రసాద్ కృషిని ప్రత్యేకంగా గుర్తించిన రూపేష్, కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ప్రేమికులకు మాత్రమే కాదు, మ్యూజిక్ లవర్స్‌కు కూడా ఇది ఓ ప్రత్యేక అనుభవంగా నిలవబోతోంది.
‘షష్టిపూర్తి' కథను ప్రత్యేకంగా రాజేంద్ర ప్రసాద్ కోసమే రాశామని యూనిట్ చెబుతోంది. సినిమా మొత్తం ఆయన పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కుటుంబ విలువలు, తరం మధ్య ఉండే తేడాలు, ప్రేమ సంబంధాలు.. ఈ అన్నింటినీ కలిపిన కథలో చిన్న చిన్న మజిలీలు అందరినీ తాకేలా ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, అర్చనా, ఆకాంక్ష సింగ్, రూపేష్ నటన సినిమాకు మరింత బలాన్ని ఇస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
విజువల్స్ విషయానికొస్తే, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ తోటా తరణి అద్భుతమైన విజువల్ ప్రపంచాన్ని సృష్టించారు. సినిమాకు భిన్నమైన వాతావరణాన్ని అందించేందుకు ఆయన చేసిన కృషి స్పష్టంగా కనిపిస్తుందని టీం పేర్కొంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ కు హార్ట్ టచింగ్ అనుభవాన్ని అందించాలనే ధ్యేయంతో రూపొందిన ఈ చిత్రం ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి.
