ఇళయరాజా ఈ సినిమాకు ఫస్ట్ హీరో
"ఇళయరాజా ఈ సినిమాకు ఫస్ట్ హీరో" అని చెప్పిన పవన్ మాటలు ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
By: Tupaki Desk | 29 May 2025 6:16 PM ISTఈమధ్య కాలంలో కుటుంబ సమేతంగా చూసే సినిమాల సంఖ్య చాలా తక్కువైంది. ఒకవేళ ఆ రూట్లో వచ్చినా పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇక తెలుగు ప్రేక్షకులకు మే 30న ఓ సంగీతాత్మక కుటుంబ చిత్రంగా ‘షష్టిపూర్తి’ రాబోతోంది. ఈ సినిమాలో మ్యూజిక్‌కు ప్రాణం పోసినది స్వర సమ్రాట్ ఇళయరాజా. ఈ పేరే సినిమా ప్రమోషన్‌కు సరిపోతుంది. మ్యూజిక్ అంటే కేవలం నేపథ్య సంగీతం మాత్రమే కాదు, అది కథకు ఊపిరిలా ఉండాలంటే ఇళయరాజా మ్యూజిక్ ఎంత కీలకమో దర్శకుడు పవన్ ప్రభ వెల్లడించడంలో తెలిసిపోతుంది.
ఈ చిత్రాన్ని ఎంతో భిన్నంగా రూపొందించిన దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ “ఇళయరాజా లేకపోతే షష్టిపూర్తి లేదు” అని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఆయన స్వరాలకు ఉన్న ఆత్మను, ఈ కథలో మిళితమయ్యే భావోద్వేగాలను వివరించారు. "ఇళయరాజా ఈ సినిమాకు ఫస్ట్ హీరో" అని చెప్పిన పవన్ మాటలు ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సంగీతం ఈ కథకు పునాది అని ఆయన స్పష్టం చేశారు.
ఇక ఈ చిత్రంలో నటుడిగా, నిర్మాతగా రెండింటినీ సమర్థంగా భుజాన వేసుకున్నాడు రూపేశ్. ‘మా ఐయే’ బ్యానర్‌పై సినిమా నిర్మించడంతోపాటు హీరోగా మెరవనున్న రూపేశ్ గురించి దర్శకుడు ప్రశంసల వర్షం కురిపించారు. రూపేశ్ స్క్రీన్‌పై కనిపించే ప్రతి క్షణం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడని ఆయన కామెంట్ చేశారు. నటుడిగా ఆయనకు ఇది ఒక కీలకమైన సినిమాగా నిలవబోతోందని నమ్మకంతో వివరణ ఇచ్చారు.
ఈ చిత్రానికి మాటలద్వారా ప్రాణం పోసిన మరో కళాకారుడు చైతన్య ప్రసాద్. ఈ సినిమా కోసం ఇళయరాజాతో కలిసి పని చేయడం తన కల నెరవేరినట్టు ఉందంటూ భావోద్వేగంగా షేర్ చేసుకున్నారని దర్శకుడు తెలిపారు. ఒక ప్రముఖ గీత రచయితగా తనకు ఇది ఒక గుర్తుండిపోయే మార్క్ సినిమా అని అన్నారు. ఈ సినిమాలోని పాటలు కథానాయిక పాత్రల భావాలకు ప్రతిబింబంగా నిలుస్తాయని చెబుతున్నారు.
ఒక కుటుంబం కథగా సాగే ఈ చిత్రం, సామాజిక అంశాలనూ ముడిపెట్టుకుంటూ ముందుకు సాగుతుందట. యువ జంట – రూపేశ్, ఆకాంక్ష సింగ్ మధ్య ప్రేమ, పోరాటం, తల్లిదండ్రుల బాధ్యతలను ప్రధానంగా చూపించే ఈ చిత్రంలో సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, అర్చన పాత్రలు మరింత బలాన్ని ఇస్తాయని మేకర్స్ చెబుతున్నారు.
ఈ నలుగురు పాత్రల చుట్టూ కథ సాగుతూనే, భావోద్వేగాలను ప్రభావవంతంగా చూపించబోతున్నారట. ఫైనల్ గా ఓ ఫీల్‌గుడ్ ఎమోషనల్ డ్రామాగా, కళాత్మకత, సంగీతత్మకత రెండూ సమపాళ్లలో మిళితమైన ఈ చిత్రం.. సంగీత ప్రియులకే కాదు, ప్రతి కుటుంబ సభ్యుడికి హృదయాన్ని తాకేలా ఉంటుందని చెబుతున్నారు. ఇక మే 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
