Begin typing your search above and press return to search.

చార్మింగ్ స్టార్ ప్రేమ కథలో అనుపమ!

శర్వానంద్ ప్రస్తుతం సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   26 April 2025 8:30 AM
Anupama Parameswaran Join Shrwa38 Movie
X

శర్వానంద్ ప్రస్తుతం సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. రెగ్యులర్ ఫార్మాట్ కు దూరంగా యాక్షన్, ఫ్యామిలీ, లవ్ జోనర్ల మిక్స్‌తో బలమైన కంటెంట్ ఉన్న ప్రాజెక్టులను ఎంచుకుంటూ ఆడియన్స్‌లో అంచనాలు పెంచుతున్నారు. ఇప్పుడు ఆయన ‘చార్మింగ్ స్టార్ 38’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న సినిమాలో నటించనున్నారు.


ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. కథను ఓ వినూత్న పీరియడ్ డ్రామాగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ను ఎంపిక చేశారు. ఆమె లుక్‌ను బ్లాక్ అండ్ వైట్ లో సగం మాత్రమే రివీల్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

లుక్ చూస్తుంటే గ్రామీణ వాతావరణంలో సాగే కథే అని సంకేతాలు ఇచ్చారు. అనుపమ పాత్ర సినిమాకు ఓ ప్రధాన బలంగా నిలవనుందన్న అంచనాలు మొదలయ్యాయి. ఇక సినిమాకు సంబంధించి హీరో శర్వానంద్ కొత్త లుక్ కోసం ప్రత్యేకంగా ముంబయికి వెళ్లారు. ఆయన క్యారెక్టర్‌కు ఫిట్ అయ్యేలా కొత్త స్టైలింగ్‌తో రెడీ అవుతున్నట్టు సమాచారం. సినిమా 1960ల తెలంగాణా-మహారాష్ట్ర బోర్డర్ ప్రాంతం నేపథ్యంగా సాగనుంది.

సంపత్ నంది ఈ నేపథ్యంలో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా రూపొందిస్తున్నారని సమాచారం. మాస్ అంశాలతో పాటు భావోద్వేగాలు కలగలిపిన కంటెంట్‌తో సినిమాను తెరకెక్కించేందుకు ఆయన కసరత్తులు మొదలుపెట్టారు. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన నేపథ్యంలో షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది.

సినిమాలో విజువల్స్, నేటివిటీ ప్రధానంగా ఉండేలా ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్న ఈ సినిమాకు టెక్నికల్ టీమ్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండనుంది. శర్వానంద్, అనుపమ ఇద్దరూ గతంలో 'శతమానం భవతి' వంటి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న చిత్రంలో కలిసి పనిచేసారు. ఆ సినిమా కూడా ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు, మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు వీరి కాంబినేషన్ మళ్లీ స్క్రీన్‌పై కనిపించనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ జంట మరోసారి మ్యాజిక్ చేయగలదా అనే చర్చ నడుస్తోంది. ఇక షూటింగ్ మొదలైన తర్వాత మిగతా క్యాస్ట్, సాంకేతిక వివరాలు వెల్లడించనున్నారు.