ఈసారి శంకర్ ను నమ్మేదెవరు?
ఒకప్పుడు సౌత్ సినిమాల స్థాయిని పెంచే సినిమాలు తీసిన స్టార్ డైరెక్టర్ శంకర్ నుంచి గత కొన్నేళ్లుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమాలు రావడం లేదు
By: Tupaki Desk | 25 Jun 2025 10:30 PMఒకప్పుడు సౌత్ సినిమాల స్థాయిని పెంచే సినిమాలు తీసిన స్టార్ డైరెక్టర్ శంకర్ నుంచి గత కొన్నేళ్లుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమాలు రావడం లేదు. శంకర్ నుంచి హిట్ సినిమా వచ్చే చాలా ఏళ్లైంది. ఇండియన్2 సినిమాతో డిజాస్టర్ అందుకున్న శంకర్, ఈ ఏడాది సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో మరో పరాజయాన్ని అందుకున్నారు. గేమ్ ఛేంజర్ రిజల్ట్ తర్వాత అసలు ఇండియన్3 వస్తుందో లేదో కూడా క్లారిటీ లేదు.
ఇండియన్2, గేమ్ ఛేంజర్ ఫలితాల ప్రభావం శంకర్ తర్వాతి సినిమాలపై పడింది. మరీ ముఖ్యంగా శంకర్ ఎంతో కాలంగా కథపై వర్క్ చేస్తూ వస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్టు పై కూడా ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. శంకర్ ఎన్నో ఏళ్లుగా తీయాలనుకుంటున్న వేల్పరి సినిమాకు ఇప్పుడు డబ్బులు పెట్టే నిర్మాతలు దొరకడం లేదని కోలీవుడ్ వర్గాల టాక్. వేల్పరి కథను మొత్తం మూడు భాగాలుగా రూ.1000 కోట్ల బడ్జెట్ తో చేయాలని శంకర్ చూస్తున్నారు.
కానీ శంకర్ ను నమ్మి అంత భారీ మొత్తం డబ్బులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పురాతాన శతాబ్ధాలకు చెందిన వేల్పరి, రాజులకు చెందిన కథ. నవల ఆధారంగా శంకర్ దీన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నారు. నవల లోని కథ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ కథను స్క్రీన్ పైకి తీసుకురావాలంటే ఏ డైరెక్టర్ కు అయినా భారీ మొత్తమే అవుతుంది, శంకర్ కైతే ఆ ఖర్చు ఇంకాస్త ఎక్కువ అవుతుందంతే.
శంకర్ స్థాయి గురించి తెలిసి కూడా కోలీవుడ్ లోని భారీ నిర్మాతలెవరూ ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు రాకపోవడం విశేషం. కనీసం ఇండియన్3 పూర్తి చేసి ఆ సినిమాతో అయినా శంకర్ తనను తాను ప్రూవ్ చేసుకుంటే తన డ్రీమ్ ప్రాజెక్టుకు ఉపయోగపడుతుంది. కానీ ఇండియన్3 ఎప్పుడొస్తుందనేది క్లారిటీ లేదు. ఏదేమైనా ఒకప్పుడు ఇండస్ట్రీకి సూపర్ హిట్ సినిమాలను అందించిన శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ కు ఓ అద్భుతమైన కథ కోసం నిర్మాతలు దొరక్కపోవడం ఆశ్చర్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన డ్రీమ్ ప్రాజెక్టు కథను నమ్మి ఏ నిర్మాత ముందుకొస్తారో చూడాలి.