శంకర్ అవతార్ రేంజ్ డ్రీమ్స్... అవసరమా సార్?
దర్శకుడు శంకర్ ఒకప్పుడు తీసిన సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
By: Tupaki Desk | 12 July 2025 2:27 PM ISTదర్శకుడు శంకర్ ఒకప్పుడు తీసిన సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా రోబో సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్ సినిమాలను తలదన్నే విధంగా రోబో సినిమా వసూళ్లు సొంతం చేసుకుంది. రోబో మాత్రమే కాకుండా అపరిచితుడు, ఒకే ఒక్కడు, జీన్స్, బాయ్స్... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలతో దర్శకుడు శంకర్ సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచాడు. సౌత్ ఇండియా సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకుల్లో గుర్తింపు, గౌరవం తెచ్చిన దర్శకుడు శంకర్ గత దశాబ్ద కాలంగా తీవ్రంగా నిరాశ పరుస్తూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన గేమ్ ఛేంజర్‌తో వచ్చి మరో ఫ్లాప్‌ను మూట కట్టుకున్నాడు.
ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అనిపించుకున్న శంకర్ దర్శకత్వంలో ఇప్పుడు కొత్త హీరో నటించేందుకు కూడా వెనుకాడుతున్నారు. అలాంటి దర్శకుడు శంకర్ భారీ పీరియాడికల్ డ్రామాను చేయాలని ఆశ పడుతున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా శంకర్ 'వేళ్పారి' సినిమాను చేయాలని భావిస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం వేళ్పారి మూవీ పై ఉందని చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ సినిమా కోసం భారీ వీఎఫ్‌ఎక్స్ వర్క్ అవసరం అవుతుందని భావిస్తున్నట్లు దర్శకుడు శంకర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్ రేంజ్‌లో భారీ వీఎఫ్‌ఎక్స్‌తో విజువల్ వండర్‌గా వేళ్పారి సినిమాను రూపొందించాలని ఆశ పడుతున్నట్లు శంకర్ చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ రోబో అని, ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేళ్పారి అన్నాడు. తమిళ పీరియాడికల్ కథను అవతార్ రేంజ్‌లో తీయాలని ఆశ పడుతున్న శంకర్ ని నమ్మి బడ్జెట్ పెట్టేందుకు ఏ నిర్మాత వస్తాడు అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటే ఆయనతో కనీసం రూ.50 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తీసేందుకు కూడా నిర్మాతలు వెనకాడుతున్నారు. కనుక వేళ్పారి సినిమాను వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రావడం దాదాపు అసాధ్యం అంటున్నారు.
ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలు విడుదలైన సమయంలో శంకర్ ఎదుర్కొన్న ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ సినిమాను దాదాపుగా ఐదు గంటల నిడివితో తీశాడట. అందులోంచి సినిమాను ఎడిట్ చేయడానికి ఎడిటర్ డబుల్ రెమ్యూనరేషన్ అడిగాడు అంటూ ట్రోల్స్ వచ్చాయి. ఈ స్థాయిలో సినిమా బడ్జెట్‌ను వృదా చేసే శంకర్‌తో సినిమా అంటే నిర్మాతలు వెనకాడుతున్నారు.
వేళ్పారి సినిమాకు ఆయన ఏకంగా 10 నుంచి 12 గంటల నిడివితో సినిమాను తీస్తాడేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వేళ్పారి సినిమాను చేయాలని అనుకోవడం శంకర్ కి ప్రస్తుత పరిస్థితుల్లో సరి కాదు. ఆయన ఒకప్పుడు గొప్ప దర్శకుడు అయ్యి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆయన స్థాయి సినిమా రావడం లేదు. అందుకే డ్రీమ్ ప్రాజెక్ట్‌లు, అవతార్ రేంజ్ సినిమాలు అవసరమా అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
