శంకర్ మళ్లీ లైఫ్ రిస్క్ ప్రాజెక్ట్ చేస్తున్నాడా?
భారీ అంచనాల మధ్య చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచి శంకర్‌కు షాక్ ఇచ్చింది. ఈ మూవీ ఇచ్చిన షాక్‌కి ఆస్కార్ ఫిల్మ్స్ వి.రవిచంద్రన్ మరో సినిమా చేయలేకపోయారు.
By: Ravindar Gorantla | 17 March 2026 12:00 AM ISTఇండస్ట్రీలో ఎవరి లైప్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ఎలాంటి మలుపులు, కుదుపులకు లోనవుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్నే ఎదుర్కొంటున్నారు స్టార్ డైరెక్టర్ శంకర్. తనదైన మార్కు భారీ బడ్జెట్ సినిమాలతో కోలీవుడ్, టాలీవుడ్‌లలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకుని ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఎదిగిన ఆయన ఇప్పుడు మాత్రం చాలా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. `రోబో` వరకు సాఫీగానే సాగిన శంకర్ ప్రయాణం చియాన్ విక్రమ్‌తో చేసిన `ఐ` నుంచి దారి తప్పుతూ కుదుపులకు గురవుతోంది.
భారీ అంచనాల మధ్య చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచి శంకర్‌కు షాక్ ఇచ్చింది. ఈ మూవీ ఇచ్చిన షాక్‌కి ఆస్కార్ ఫిల్మ్స్ వి.రవిచంద్రన్ మరో సినిమా చేయలేకపోయారు. కమల్‌తో కలిసి సహ భాగస్వామిగా `విశ్వరూపం` రెండు భాగాలని నిర్మించినా సోలో ప్రొడ్యూసర్‌గా మాత్రం ప్రొడక్షన్ ఆపేసి షాక్ ఇచ్చారు. ఇక ఈ మూవీ తరువాత లైకా ప్రొడక్షన్‌తో కలిసి చేసిన `2.ఓ` ఫరవాలేదు అనిపించినా ఆశించిన లాభాల్ని మాత్రం తెచ్చి పెట్టలేకపోయింది.
ఇదే సంస్థలో కలిసి శంకర్ చేసిన `ఇండియన్ 2` వివాదం ఇప్పటికీ శంకర్‌ని వెంటాడుతూనే ఉంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో క్రేన్ యాక్సిడెంట్ జరగడం, అందులో డైరెక్షన్ టీమ్‌కు సంబంధించి నలుగురు వ్యక్తులు మృతి చెందడంతో శంకర్‌కు, లైకాకు మధ్య వివాదం ముదిరి సినిమా ఆగిపోయే దాకా వచ్చింది. `విక్రమ్` సక్సెస్ తరువాత ఉదయనిధి స్టాలిన్‌ని ఒప్పించిన కమల్ లైకా , శంకర్‌ల మధ్య సయోధ్య కుదిర్చి `ఇండియన్ 2`ని పూర్తి చేసి రిలీజ్ చేయించాడు. ఫలితం డిజాస్టర్.
ఇదే డిజాస్టర్ అనిపించుకుంటే దీనికి సీక్వెల్ గా `ఇండియన్ 3`ని కూడా అప్పటికే మొదలు పెట్టి మధ్యలో ఆపేశారు. ఇప్పడు దీన్ని పూర్తి చేసి ఓటీటీకి ఇవ్వడం శంకర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై లైకా వర్గాలు ఇప్పటికీ శంకర్‌పై గుర్రుగానే ఉన్నారు. దీన్ని పూర్తి చేయకుండా శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ `వేల్పరి`ని పట్టాలెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అది అంత ఈజీ కాదని తెలుస్తోంది. `ఇండియన్ 3`ని పూర్తి చేయకుండా శంకర్ `వేల్పరి`ని స్టార్ట్ చేస్తే లీగల్ గా ప్రొసీడ్ అవుతామని లైకా వర్గాలు బాహాటంగానే హెచ్చరిస్తున్నాయి.
ఈ వివాదాం సద్దుమనగాలంటే శంకర్ `ఇండియన్ 3`ని పూర్తి చేయాల్సిందే. దాన్ని పూర్తి చేసి `వేల్పరి`ని మొదలు పెట్టాలంటే ప్రొడ్యూసర్ ఎవరన్నది ఇప్పుడు శంకర్‌కు ప్రధాన సమస్యగా మారింది. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యే హీరోలు రెండేళ్లు డేట్స్ ఇవ్వాల్సిందే. అలా డేట్స్ ఇచ్చే పరిస్థితిలో ఏ హీరో కనిపించడం లేదు. శంకర్ కాబట్టి ధనుష్ డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ధనుష్ ఇప్పటికే వరుస ప్రాజెక్ట్‌లని ప్రకటించాడు. ఇళయరాజా బయోపిక్‌తో పాటు అబ్దుల్ కలాం బయోపిక్ కూడా లైన్‌లో ఉంది. అంతే కాకుండా తన 55వ ప్రాజెక్ట్‌ని ఇటీవలే మొదలు పెట్టాడు. అది పూర్తి చేయాలి. `వేల్పరి` ఛారిత్రక నేపథ్యంలో సాగు పీరియాడిక్ మూవీ దీనికి భారీ సెట్స్ తో పాటు భారీ బడ్జెట్ చాలా అవసరం. శంకర్ ప్రస్తుత రికార్డ్‌ని బట్టి ఇంత వరకు ఏ ప్రొడ్యూసర్ కూడా ముందుకు రాలేదు. దీంతో శంకర్ `వేల్పరి` అంటూ మరో తలనొప్పిని నెత్తికి ఎత్తుకుంటున్నాడని కోలీవుడ్‌లో కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
