సరికొత్త ట్రెండ్.. విడాకులను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న నటి..
తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను చించేస్తూ మరీ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకోవడం చూసి అటు సెలబ్రిటీలు ఇటు అభిమానులు పెద్ద ఎత్తున ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
By: Madhu Reddy | 20 Sept 2025 2:00 PM ISTఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు అలా పెళ్లిళ్లు చేసుకొని ఇలా విడిపోతున్న విషయం తెలిసిందే. అయితే అందరూ అలాగే ఉన్నారా అంటే కాదు కానీ.. కొంతమంది మాత్రం అలా విడిపోయి అభిమానులకు నిరాశను మిగులుస్తున్నారు.. ఇకపోతే ఎవరైనా సరే ఒక బంధం నుండి విడిపోతున్నాము అంటే దుఃఖంతో మనసు నిండిపోతుంది. అంతేకాదు తమ గోప్యతకు భంగం కలిగించకండి అంటూ పోస్ట్లు పెడుతూ తమ భాగస్వామిని తలుచుకుంటూ ఎమోషనల్ అయిన వారిని కూడా ఎంతో మందిని చూశాం. కానీ ఇప్పుడు ఒక నటి మాత్రం విడాకులు తీసుకొని ఘనంగా ఆ విడాకులను సెలబ్రేట్ చేసుకుంది. తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను చించేస్తూ మరీ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకోవడం చూసి అటు సెలబ్రిటీలు ఇటు అభిమానులు పెద్ద ఎత్తున ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమె ఎవరు? అసలేం జరిగిందో? ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. తమిళ ఇండస్ట్రీకి చెందిన బుల్లితెర నటి షాలిని.. 'ముల్లుమ్ మల్లరుమ్' అనే తమిళ సీరియల్ తో నటిగా మంచి పేరు సొంతం చేసుకుంది. అంతేకాదు జీ తమిళ్ లో ప్రసారమైన సూపర్ మామ్ రియాలిటీ షోలో కూడా కనిపించిన ఈమె.. గతంలో రియాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. అయితే కొన్ని నెలల క్రితం తన భర్త తనను శారీరకంగా , మానసికంగా వేధించాడు అంటూ విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించిన ఈమెకు ఈ ఏడాదిలో విడాకులు కూడా మంజూరయ్యాయి. విడాకులు మంజూరైన సందర్భంగా సంతోషంతో ఉబ్బితబిబ్బైన ఈమె.. ఏకంగా ఫోటోషూట్ నిర్వహించి మరీ విడాకుల విషయాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా తన ఇన్స్టా లో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
అంతేకాదు క్యాప్షన్ కూడా జోడించింది." వివాహ బంధాన్ని విడిచిపెట్టడం నిజంగా నా దృష్టిలో సరైన నిర్ణయమే. విడాకులు తీసుకున్న వారందరికీ కూడా ఇదే సందేశాన్ని నేను ఇస్తున్నాను. ఈ విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఇలాంటి వాటిని మీరు తప్పకుండా ఎదుర్కోవాలి. విడాకులు తీసుకుంటే మనం ఫెయిల్ అయినట్టు కాదు.. ఇది మన లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్. మన జీవితంలో సానుకూల మార్పులకు సంకేతం కూడా.. అందుకే ఏదే జరిగినా ధైర్యంగా మహిళలు నిలబడాలి. అందుకే నాలాగా ధైర్యవంతులైన మహిళలందరికీ కూడా ఈ ఈవెంట్ ను అంకితం చేస్తున్నాను" అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది.
అంతేకాదు విడాకులు తీసుకోవడాన్ని సెలబ్రేట్ చేస్తూ తన మాజీ భర్త ఫోటోను కూడా చించివేస్తూ.. ఆ ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విడాకులు తీసుకుంటే బాధపడాల్సింది పోయి ఇలా ఎవరైనా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారా? ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండు సృష్టించింది ఈవిడ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
