Begin typing your search above and press return to search.

షారుఖ్ ట్రిపుల్ ధమాకా లేనట్లే

ఐతే ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే ఈ ఏడాదే షారుఖ్ ట్రిపుల్ ధమాకా కూడా ఇవ్వాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   10 Sep 2023 2:45 AM GMT
షారుఖ్ ట్రిపుల్ ధమాకా లేనట్లే
X

ఓ మోస్తరు హిట్ కూడా లేకుండా ఏళ్లకు ఏళ్లు గడిపేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు ఈ ఏడాది కరువంతా తీరిపోయింది. రిపబ్లిక్ డే వీకెండ్లో వచ్చిన 'పఠాన్' సినిమా ఆయనకు భారీ విజయాన్నందించింది. ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఈ వీకెండ్లో రిలీజైన 'జవాన్' కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. రెండు రోజుల్లోనే 'జవాన్' రెండొందల కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఎదురే లేని పరిస్థితి కనిపిస్తోంది.

ఫుల్ రన్లో మరోసారి షారుఖ్‌కు వెయ్యి కోట్ల వసూళ్లు గ్యారెంటీ అనిపిస్తోంది. వేరే బాలీవుడ్ స్టార్లు వంద కోట్లకు కూడా కష్టపడుతుంటే.. ఏడు నెలల వ్యవధిలో రెండు వెయ్యి కోట్ల సినిమాలంటే షారుఖ్‌ది మామూలు సంబరం కాదు. ఐతే ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే ఈ ఏడాదే షారుఖ్ ట్రిపుల్ ధమాకా కూడా ఇవ్వాల్సి ఉంది. క్రిస్మస్‌కు ఆయన కొత్త చిత్రం 'డంకి' షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే.

రాజ్ కుమార్ హిరాని లాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తీస్తున్న సినిమా కావడంతో 'డంకి' కూడా కచ్చితంగా సక్సెస్ కావడం గ్యారెంటీ.. షారుఖ్ ఖాతాలో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ జమ కాబోతున్నట్లే అని అభిమానులు ఫిక్సయిపోయారు. కానీ తాజా సమాచారం ప్రకారం 'డంకి' క్రిస్మస్‌కు రిలీజ్ కావట్లేదట. ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్ ఏవీ ఇంత వరకు బయటికి రాలేదు. అలాగే చిన్న టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. ఫస్ట్ లుక్ కూడా రాలేదు. ఇది కూడా భారీ చిత్రమే కావడంతో షూట్ ఆలస్యం అవుతోందట. క్రిస్మస్‌కు సినిమాను రెడీ చేయడం అసాధ్యం అంటున్నారు. అందుకే సినిమా నుంచి ఏ ప్రోమోలు కూడా రిలీజ్ చేయట్లేదు.

ఆల్రెడీ షారుఖ్ నుంచి ఈ ఏడాది రెండు భారీ చిత్రాలు వచ్చి మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఈ ఏడాదే ఇంకో సినిమా రిలీజైతే ఓవర్ డోస్ అయిపోతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నారట. కాబట్టి క్రిస్మస్‌కు షెడ్యూల్ అయిన వేరే సినిమాలకు భయం లేనట్లే.