Begin typing your search above and press return to search.

క్యాంటీన్ న‌డుపుకునే వ్య‌క్తి కొడుకు సూప‌ర్‌స్టార్

అత‌డు ఒక క్యాంటీన్ య‌జ‌మాని కొడుకు అంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. కింగ్ ఖాన్ SRK తండ్రి మీర్ తాజ్ మహమ్మద్ ఖాన్ స్వాతంత్య్ర‌ కార్యకర్త. అనేక భార‌తీయ ప్రతిఘటన ఉద్యమాలలో పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 11:30 PM GMT
క్యాంటీన్ న‌డుపుకునే వ్య‌క్తి కొడుకు సూప‌ర్‌స్టార్
X

భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో పెను సంచ‌ల‌నం అత‌డు. సూప‌ర్‌స్టార్ అనే ప‌దానికి సిస‌లైన నిర్వ‌చ‌నం. కెరీర్ లో ఎన్నో రికార్డ్ హిట్ చిత్రాల్లో న‌టించాడు. కింగ్ ఆఫ్ రొమాన్స్ అంటూ అత‌డిని కీర్తిస్తుంది లోకం. ఇండియ‌న్ స్క్రీన్ పై బాద్ షాగా, కింగ్ ఖాన్ గా వెలుగుతున్న‌ అత‌డు ఎవ‌రో ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. హి ఈజ్ రియ‌ల్ కింగ్ షారూఖ్ ఖాన్.

అయితే కింగ్ ఖాన్ షారూఖ్ కుటుంబ‌ నేప‌థ్యం గురించి తెలిసింది చాలా త‌క్కువ‌. అత‌డు ఒక క్యాంటీన్ య‌జ‌మాని కొడుకు అంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. కింగ్ ఖాన్ SRK తండ్రి మీర్ తాజ్ మహమ్మద్ ఖాన్ స్వాతంత్య్ర‌ కార్యకర్త. అనేక భార‌తీయ ప్రతిఘటన ఉద్యమాలలో పాల్గొన్నారు. తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో క్యాంటీన్ నిర్వహించాడు. అతని తల్లి లతీఫ్ ఫాతిమా ఒక‌ మేజిస్ట్రేట్.. ఆమె(ఫాతిమా) తండ్రి సీనియర్ ప్రభుత్వ ఇంజనీర్. మ‌హ‌మ్మద్ ఖాన్- ల‌తీఫ్‌ వీరిద్దరూ 1959లో పెళ్లి చేసుకున్నారు. వీరికి షారూఖ్ కుమారుడు.

చిన్న వ‌య‌సులోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి..!

షారూఖ్ ఇంతింతై అన్న చందంగా పెద్ద స్టార్ గా ఎదిగాడు. ప‌ఠాన్ - జ‌వాన్ చిత్రాల‌తో అత‌డు 1000 కోట్ల క్ల‌బ్ హీరో అయ్యాడు. అయినా కానీ అత‌డు చిన్న వ‌య‌సులోనే చాలా మాన‌సిక వేద‌న‌ను అనుభ‌వించాడ‌న్ని తెలిసింది త‌క్కువ మందికే. చిన్న‌ప్పుడే త‌న త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి ఎంతో ఆవేద‌న‌ను అనుభ‌వించాడు. త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన బాధ‌లో అత‌డి సోద‌రి తీవ్ర‌మైన డిప్రెష‌న్ లోకి వెళ్లిపోగా, త‌న‌ని ఇప్ప‌టికీ షారూఖ్ ఆదుకుంటున్నాడు.

ఖాన్ తండ్రి 1981లో క్యాన్సర్‌తో మరణించారు. అతడి తల్లి 1991లో మధుమేహం సమస్యలతో మరణించారు. వారి తల్లిదండ్రుల మరణం తరువాత షారూఖ్‌ అక్క షహనాజ్ లాలారూఖ్ (జననం 1960) తీవ్ర డిప్రెష‌న్ లోకి వెళ్లారు. ఖాన్ ఆమెను సంరక్షించే బాధ్యతను తీసుకున్నాడు. షహనాజ్ తన సోదరుడు అతని కుటుంబంతో కలిసి ముంబైలోని వారి భవనంలో నివసిస్తున్నారు.

అంతేకాదు అనారోగ్యంతో ఉన్న తన తల్లిని రక్షించమని అప్ప‌ట్లో ఖాన్ ఎంత‌గానో ప్రార్థించిన విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. వందసార్లు-రిపోర్టుల కోసం ప్రార్థనను పునరావృతం చేయమని అభిమానుల‌ను కోరాడు. అతడు ఐసీయులో ఉన్న‌ తన తల్లి చనిపోదని భావించి ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడట‌. కానీ చివ‌రికి త‌న త‌ల్లిని కోల్పోయాడు. షారుఖ్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద స్టార్ల‌లో ఒకరిగానే మ‌న‌కు తెలుసు. అయినా కానీ అత‌డికి విజయం అంత తేలికగా రాలేదు. స్టార్‌డమ్ సాధించడానికి ముందు, SRK చాలా చిన్నతనంలోనే తన తల్లి - తండ్రిని కోల్పోవ‌డం బిగ్ సెట్ బ్యాక్.

అనుపమ్ ఖేర్ షో లో అనుపమ్ ఖేర్‌తో మాట్లాడిన షారుఖ్ ఖాన్ తన తండ్రి అకాల మరణం తన తల్లిని ఎలా ప్రభావితం చేసిందో కూడా చెప్పాడు. తన తల్లి చాలా ఆరోగ్యంగా ఉండేదని అయితే అకస్మాత్తుగా, ఒక రాత్రి ఆమెకు కాళ్లలో నొప్పి వచ్చిందని.. చివరికి ఆమెకు డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని.. అది ఆమె జీవితాన్ని ఒకటిన్నర నెలల్లో మార్చేసింద‌ని ఖాన్ చెప్పాడు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ త‌న త‌ల్లిని న్యూఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో ఐసియు వార్డులో చేర్చినట్లు ఎస్ఆర్‌కె తెలిపారు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఆమె మ‌ర‌ణించారు.