Begin typing your search above and press return to search.

ఇడ్లీ వడ వివాదం: షారూఖ్ తన తప్పు తెలుసుకున్నాడా?

ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ చేసిన 'ఇడ్లీ వడ సాంబార్' కామెంట్స్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   7 March 2024 11:22 AM GMT
ఇడ్లీ వడ వివాదం: షారూఖ్ తన తప్పు తెలుసుకున్నాడా?
X

ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ చేసిన 'ఇడ్లీ వడ సాంబార్' కామెంట్స్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను స్టేజ్ మీదకు ఆహ్వానిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై సౌత్ అభిమానుల ఫైర్ అవుతున్నారు. కింగ్ ఖాన్ సరదాగా అన్నారో, కావాలనే అన్నాడో తెలియదు కానీ.. ఇది సోషల్ మీడియాలో ఆయనపై విపరీతమైన ట్రోలింగ్ చేయడానికి అవకాశం కల్పించింది. దీనిపై షారూక్ ఇంత వరకూ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. అయితే ఈ ఇన్సిడెంట్ తో ఇకపై స్టేజ్ మీద ఎలా పడితే అలా మాట్లాడకూడదని బాద్ షా జాగ్రత్త వహిస్తున్నారని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. గుజరాత్‏లోని జామ్ నగర్ వేదికగా గ్రాండ్ గా జరిగిన ఈ సెలబ్రేషన్స్ లో.. భారతీయ సినీ రాజకీయ క్రీడా ప్రముఖులతో పాటుగా పలువురు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. అయితే అంబానీ ఇంట సంబరాలు అక్కడితో అయిపోలేదు. ముఖేష్ - నీతా అంబానీలు బుధవారం జామ్‌ నగర్‌లో మరో ఈవెంట్‌ ను నిర్వహించారు. దీనికి షారుఖ్ ఖాన్ మరోసారి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో షారూక్ చాలా నార్మల్ టోన్ లో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

షారూక్ ఖాన్ మాట్లాడుతూ.. "నేను గుజరాతీలో మాట్లాడబోతున్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే, అది ఈ స్పీచ్ రాసిచ్చిన వారి తప్పు అవుతుంది. ఒకవేళ నేను ఏం తప్పుగా మాట్లాడకపోతే మాత్రం అది నా తెలివితేటలు అని అర్థం చేసుకోండి" అని అన్నారు. ఇదంతా చూస్తుంటే రామ్ చరణ్‌ కి సంబంధించిన ఇడ్లీ వడ వివాదంతో షారుక్ చాలా ప్రభావితమైనట్లు కనిపిస్తోంది.

షారుక్ - రామ్ చరణ్ మధ్య చాలా కాలంగా మంచి సన్నిహిత్యం వుంది. అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఖాన్ త్రయం స్టేజ్ మీద 'నాటు నాటు' సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్నప్పుడు.. RRR యాక్టర్ అక్కడే ఉన్న విషయాన్ని నీతా అంబానీ గుర్తు చేశారు. దీంతో షారూక్ వెంటనే 'రామ్ చరణ్ ఎక్కడున్నావ్?' అంటూ కేకలు వేశారు. 'ఇడ్లీ వడ సాంబార్ తినేసి కూర్చున్నావా, బెండ్ ఇడ్లీ వడ రామ్ చరణ్ ఎక్కడున్నావ్?' అంటూ పిలిచారు. గ్లోబల్ స్టార్ ను ఆ విధంగా ఆహ్వానించడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సౌత్ వాళ్ళని చులకన చేసి మాట్లాడారంటూ నెటిజన్లు మండి పడ్డారు.

షారూక్ ఖాన్ దురుద్దేశంతో అన్నాడో, సరదాగా పిలిచాడో అనేది పక్కన పెడితే.. ఇది ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చేలా చేసింది. అందుకే ఈసారి షారుఖ్ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని నిర్ణయించుకున్నాడని అర్థమవుతోంది. మరొక కాంట్రవర్సీ క్రియేట్ చెయ్యకూడదని భావించినట్లు తెలుస్తుంది. అందుకే వచ్చీ రాని గుజరాతీలో మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లితే తనను నిందించవద్దని ముందే పరోక్షంగా విన్నవించుకున్నారు. మొన్న జరిగిన రచ్చ దృష్టిలో పెట్టుకొని ఇకపై వేదిక మీద మాట్లాడే ముందు, వివాదం చెలరేగకుండా చూసుకునేలా మాట్లాడాలని షారుక్ నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.