Begin typing your search above and press return to search.

షారుఖ్ నోటి దురుసు.. కొత్త కాదు

ఫిలిం ఫేర్ వేడుకలో ఒకసారి సహ నటుడు అయిన నీల్ నితిన్ ముకేశ్.. షారుఖ్ వ్యాఖ్యలకు బాగా హర్టయ్యాడు. షారుఖ్‌ను షటప్ అంటూ వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనం రేపింది.

By:  Tupaki Desk   |   5 March 2024 10:41 AM GMT
షారుఖ్ నోటి దురుసు.. కొత్త కాదు
X

దక్షిణాది జనాల ఆహారపు అలవాట్లు, సంస్కృతి గురించి ఉత్తరాది వాళ్లు తక్కువ చేసి మాట్లాడడం కొత్తేమీ కాదు. హిందీ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు కూడా తరచుగా సౌత్‌ను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు దక్షిణాది సినిమాల హవా పెరిగి, బాలీవుడ్ బాగా డౌన్ అయిన నేపథ్యంలో వాళ్లు కొంచెం తగ్గి ఉంటున్నారు కానీ.. గతంలో పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పటికీ అప్పుడప్పుడూ బాలీవుడ్ వాళ్ల అహంకారం బయటపడిపోతూ ఉంటుంది.

తాజాగా ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు హాజరైన రామ్ చరణ్‌ను వేదిక మీదికి ఆహ్వానిస్తూ.. ఇడ్లీ వడా అంటూ అవాకులు చెవాకులు పేలాడు షారుఖ్ ఖాన్. ఇదేదో సరదాకి చేసిందని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. సౌత్ ఆహారపు అలవాట్లను కించపరడచడమే అంటూ షారుఖ్ మీద మన జనాలు విరుచుకుపడుతున్నారు.

ఐతే వేదికల మీద షారుఖ్ నోటి దురుసు ప్రదర్శించడం ఇది కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఫిలిం ఫేర్ వేడుకలో ఒకసారి సహ నటుడు అయిన నీల్ నితిన్ ముకేశ్.. షారుఖ్ వ్యాఖ్యలకు బాగా హర్టయ్యాడు. షారుఖ్‌ను షటప్ అంటూ వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనం రేపింది. ఇంతకీ అప్పుడు ఏమైందంటే.. నీల్ నితిన్ ముకేశ్ ప్రస్తావన వచ్చినపుడు షారుక్ తన పేరును పలికి.. మాకందరికీ 'ఖాన్' అని ఇంటిపేర్లు ఉన్నాయి, నీకు ఇంటిపేరు ఎక్కడ అంటూ ఎగతాళిగా మాట్లాడాడు. వెంటనే నీల్ ముఖం వాడిపోయింది.

ఇది చాలా ఇన్సల్టింగ్‌గా ఉందని చెబుతూ.. ఇక్కడే తన తండ్రి కూడా ఉన్నాడని, ఇలాంటి ప్రశ్న ఎలా వేస్తారని కోపంగా ప్రశ్నించాడు. ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గు చేటు అని పేర్కొంటూ మీకొకటి చెప్పనా అని పర్మిషన్ అడిగి మరీ 'షటప్' అన్నాడు.

దీంతో వేదిక మీద ఉన్న షారుఖ్, సైఫ్ అలీఖాన్ ముఖాల్లో రంగులు మారిపోయాయి. ఐతే ఆ కామెంట్ తర్వాత నీల్ నితిన్ కెరీరే దెబ్బ తిందని.. దీనికి పరోక్ష కారణం షారుఖే అని బాలీవుడ్ జనాలు అంటుంటారు. రామ్ చరణ్‌ మీద తాజా కామెంట్లతో అప్పటి వివాదాన్ని నెటిజన్లు గుర్తు చేస్తూ షారుఖ్‌ను మరింతగా విమర్శిస్తున్నారు.