నెలకు 25లక్షలు.. అద్దె ఇంట్లోకి స్టార్ హీరో షిఫ్ట్
కింగ్ ఖాన్ షారూఖ్ ముంబైలోని `మన్నత్` ఇంటిని రెనోవేషన్ చేయించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 April 2025 2:30 AMకింగ్ ఖాన్ షారూఖ్ ముంబైలోని `మన్నత్` ఇంటిని రెనోవేషన్ చేయించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. మన్నత్ పై భారీగా అదనపు అంతస్తులను నిర్మించనున్నారని, సంబంధిత పనులు ప్రారంభం కానున్నాయని వార్తలు వచ్చాయి. ఇక ఈ భవంతి పునరుద్ధరణకు సంబంధించిన అనుమతులు అన్నిటినీ ఖాన్ కుటుంబం బిఎంసీ నుంచి తీసుకుంది.
నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో షారుఖ్ ఖాన్ కుటుంబంతో కలిసి మన్నత్ నుండి బయటకు వెళుతున్న ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఇటీవల వారు బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలోని ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్ భవనంలోకి ప్రవేశించడం కనిపించింది. అక్కడ వారు దాదాపు రెండు సంవత్సరాలు నివసించనున్నారు. షారుఖ్, భార్య గౌరీ .. వారి పిల్లలు - ఆర్యన్, సుహానా, అబ్రామ్ - బాంద్రాలోని పాలి హిల్ ఇంట్లోకి షిఫ్టయ్యారు. భవనం నాలుగు అంతస్తులలో వీరు నివసిస్తారు.
ఇటీవలి ఓ వీడియోలో షారుఖ్, అతడి భార్య గౌరీ, కుమార్తె సుహానా కలిసి కారు దిగి అపార్ట్‌మెంట్ భవనంలోకి అడుగుపెడుతున్న దృశ్యం కనిపించింది. సుహానా ఆ సమయంలో పసుపు రంగు దుస్తులను ధరించగా, షారుఖ్ తెల్లటి చొక్కాలో సింపుల్‌గా ఉన్నారు. మొత్తం కుటుంబం కలిసి ఉండటం అభిమానులను ఎగ్జయిట్ చేసింది. షారూఖ్ కుటుంబం భగ్నానీలకు చెందిన ప్రాపర్టీని నెలకు 25 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుందని ఇంతకుముందే కథనాలొచ్చాయి. లీజుకు సంబంధించిన వివరాలను హిందీ మీడియా వెల్లడించింది.
మన్నత్‌లో పునరుద్ధరణ పనులు మే నెలలో ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. బంగ్లా పైన ఇంకా మరికొన్ని అంతస్తులను పెంచేందుకు సాంకేతికంగా పనులు సాగుతున్నాయి. దీని కోసం షారుఖ్ కోర్టు అనుమతి పొందాల్సి వచ్చింది. మన్నత్ అనేది రాచరికంలో గ్రేడ్ 3 వారసత్వ నిర్మాణం.. ఏదైనా నిర్మాణాత్మక మార్పు చేయాలంటే, సరైన అనుమతులు పొందిన తర్వాత మాత్రమే చేయాలి. అందుకే ఖాన్ సంబంధిత శాఖల నుంచి అనుమతులు సంపాదించాడు.