డబ్బు - స్టార్‌డమ్ కంటే జీవితంలో ముఖ్యమైనది!
జీవితంలో డబ్బు వేటలో అలసిపోయిన చాలామందికి చివరికి మిగిలేది ఏది? తీవ్రమైన ఒత్తిడి, మానసిక అలసట, కుంగుబాటు! చాలా అధ్యయనాల్లో తేలిన వాస్తవమిది.
By: Tupaki Desk | 20 April 2025 4:00 PM ISTజీవితంలో డబ్బు వేటలో అలసిపోయిన చాలామందికి చివరికి మిగిలేది ఏది? తీవ్రమైన ఒత్తిడి, మానసిక అలసట, కుంగుబాటు! చాలా అధ్యయనాల్లో తేలిన వాస్తవమిది. డబ్బు మనిషికి అవసరమే కానీ, డబ్బు మాత్రమే జీవితాన్ని నడిపించకూడదని చెబుతారు పెద్దలు. కొందరు డబ్బు పరపతి కోసం ఎంతటి ఆకృత్యాలకు అయినా తెగబడుతున్నారు. ఇలాంటి వాళ్లకు మానసిక అశాంతి తప్ప ఏమీ మిగలదని `కర్మ` ప్రిన్సిపల్ చెబుతోంది.
ఇప్పుడు డబ్బు, స్టార్ డమ్ తో సాధించుకోలేనిది ఏది? అనేదాని గురించి కింగ్ ఖాన్ షారూఖ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఖాన్ మాట్లాడుతూ.. ``జీవితంలో డబ్బు, స్టార్ డమ్ కంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా జీవించడమే నిజమైన ఆనందం`` అని అన్నారు.
పరిశ్రమలో అగ్ర హీరోనే అయినా తనకు కూడా కొన్ని బాధలున్నాయని షారూఖ్ తెలిపారు. ఒత్తిళ్లకు గురయ్యానని అంగీకరించాడు. తన తల్లిదండ్రుల మరణం సోదరిపై తీవ్ర ప్రభావం చూపిందని, ఆ ఘటనను తాను ఇంకా మర్చిపోలేదని షారూఖ్ అన్నారు. ఆరోజు నా తండ్రి పార్థీవ దేహం ముందు, నా సోదరి ఏడ్వకుండా అలాగే ఉండిపోవడం చూశానని తెలిపారు. దాని నుంచి కోలుకోవడానికి ఆమెకు రెండేళ్లు పట్టిందని వెల్లడించాడు. అలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఉండేందుకు తాను ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉంటానని తెలిపాడు. షారూఖ్ ప్రస్తుతం కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. సుహానా ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
