బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ సంచలన నిర్ణయం?
బాలీవుడ్ బాద్‌షాగా పేరు తెచ్చుకున్న క్రేజీ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కొంత విరామం తరువాత `పఠాన్`తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 26 Dec 2025 9:00 PM ISTబాలీవుడ్ బాద్‌షాగా పేరు తెచ్చుకున్న క్రేజీ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కొంత విరామం తరువాత `పఠాన్`తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన విషయం తెలిసిందే. `రయీస్` తరువాత వరుస ఫ్లాప్‌లతో తన ఫామ్‌ని కోల్పోయి ఒక దశలో కెరీర్ ఇక ముగిసినట్టేనా అనే విమర్శలని ఎదుర్కొన్నాడు. ఆరేళ్ల పాటు హీరోగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్న షారుక్ 2023లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.
యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా సిద్ధార్ధ్ ఆనంద్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ `పఠాన్`తో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాడు. భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.1000 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టించింది. షారుక్ ఖాన్ క్రేజ్ ఇంకా తగ్గలేదని మరోసారి నిరూపించి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేసింది. ఇక ఇదే ఊపుని కొనసాగిస్తూ షారుక్ 2023లో మరో బ్లాక్ బస్టర్‌ని అందించాడు అదే `జవాన్`.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అట్లీ తొలిసారి షారుక్‌తో కలిసి చేసిన ఈ మూవీ కూడా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్‌కు నూతన జవసత్వాలని అందించి జోష్ నింపింది. షారుక్ ఖాన్ క్రేజ్‌ని మరింత పెంచి కెరీర్ మళ్లీ ఊపందుకునేలా చేసింది. అయితే ఆ తరువాత రాజ్ కుమార్ హిరానితో చేసిన `డంకీ` మాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది. భారీ అంచనాలు పెట్టుకున్నఈ సినిమా తీవ్ర నిరాశకు గురి చేయడంతో షారుక్ రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు.
దాదాపు మూడేళ్ల విరామం తరువాత `కింగ్` మూవీతో షారుక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. `పఠాన్` మూవీతో తన కెరీర్‌ని మళ్లీ ట్రాక్‌లో పెట్టిన దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్‌తో ఈ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతో ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ అరంగేట్రం చేస్తోంది. అంతే కాకుండా దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో అభిషేక్‌బచ్చన్, అనిల్ కపూర్, జాకీష్రాఫ్, అర్షద్‌వర్సీ, రాణీ ముఖర్జీ, `కిల్` ఫేమ్ రాఘవ్ జుయెల్ నటిస్తున్నారు. 2026లో ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
గౌరీ ఖాన్, సిద్ధార్ధ్ ఆనంద్, మమత ఆనంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే `కింగ్` షారుక్ ఖాన్ చివరి సినిమా అనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి. ఈ మూవీ తరువాత షారుక్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడని, సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఆరోగ్య సమస్యల కారణంగా షారుక్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నాడని, సినిమాల కారణంగా ఇంత కాలం ఫ్యామిలీకి దూరంగా ఉన్నానని, ఇకపై ఫ్యామిలీకే ఎక్కువ టైమ్ కేటాయిస్తూ ట్రావెల్ చేస్తూ విదేశాలు చుట్టాలనుకుంటున్నాడట. అయితే షారుక్ సన్నిహితులు మాత్రం ఇదంతా రూమరేనని కొట్టిపారేస్తున్నారు.
