దేశీ న్యాయవ్యవస్థను షేక్ చేసిన కేసుపై..!
భారతీయ న్యాయవ్యవస్థలో సవాళ్లతో సంచలనాలు సృష్టించిన పలు కేసులపై సినిమాలను తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకులు ఆసక్తిని కనబరుస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 April 2025 12:46 PM ISTభారతీయ న్యాయవ్యవస్థలో సవాళ్లతో సంచలనాలు సృష్టించిన పలు కేసులపై సినిమాలను తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకులు ఆసక్తిని కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఒరవడిలో 1970లలో సంచలనం సృష్టించిన ఒక కేసులో ముస్లిమ్ యువతి పోరాట కథను, విక్టరీని ఇప్పుడు బాలీవుడ్ లో వెండితెరకెక్కిస్తున్నారు. ఇది షాభానో వర్సెస్ అహ్మద్ ఖాన్ కథ. ముస్లిమ్ కమ్యూనిటీలో భార్యాభర్తల విడాకుల వ్యవహారంలో అన్యాయానికి సంబంధించిన కథ.
ధైర్యం, నిజం తప్ప తనకు ఎలాంటి అడా లేని ఒక స్త్రీ తన భర్తను, శక్తివంతమైన వక్ఫ్ బోర్డును ఎదుర్కొని, సుప్రీంకోర్టు వరకు వెళ్లి, ప్రత్యర్థుల్ని ఒంటరిగా ఎలా ఓడించిందో తెలిపే కథ ఇది. ఈ కేసు మహిళలు చట్టబద్ధమైన వాదనలు చేయడానికి పునాది వేసింది. ఇలాంటివాటిని కోర్టుల్లో అంతకుముందు అనుమతించలేదు. ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా మీడియా హెడ్ లైన్స్ లో నిలిచింది. భారత ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థను రూపొందించిన టాప్ టెన్ సంఘటనలలో ఒకటిగా నిలిచింది.
స్త్రీ ద్వేషపూరిత చట్టాలలో మార్పులు తెచ్చిన అరుదైన కేసుగాను షా భానో కేసు చరిత్రకెక్కింది. వివాహం విఫలమైనప్పుడు అన్ని మతాలు లేదా కులాలు .. విభిన్న సామాజిక-ఆర్థిక వర్గాల మహిళలు తమ న్యాయబద్ధమైన హక్కులను పొందడానికి ఈ కేసు సహాయపడింది. ఈ కేసు యూనిఫామ్ సివిల్ కోడ్ కింద ``ఒక దేశం ఒకే చట్టం`` అనే ఆలోచనకు దారితీసింది. వ్యవస్థీకృత మతం ముసుగులో స్త్రీ ద్వేషపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడిన షా బానో కథ ఎంతో స్ఫూర్తిగా నిలిచింది. నిజానికి చట్టపరమైన చట్రంలో చర్చకు తావులేని స్థితిలో ముస్లిమ్ వ్యవస్థలో పాతుకుపోయిన అన్యాయాన్ని ప్రశ్నించడంలో సహకరించింది.
షా బానో కేసు ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ యామి గౌతమ్ భర్తగా నటిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ ఏడాదిలో అక్టోబర్ లేదా నవంబర్ లో విడుదల కానుంది. సుపర్ణ్ ఎస్.వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
