Begin typing your search above and press return to search.

1000 కోట్ల స్కాంలో సీనియ‌ర్ హీరో ప్ర‌మేయం?

ముఖ్యంగా, ఈ కేసులో గోవిందా అనుమానితుడు లేదా నిందితుడు కాదని ఈఓడబ్ల్యూ అధికారి స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 2:45 AM GMT
1000 కోట్ల స్కాంలో సీనియ‌ర్ హీరో ప్ర‌మేయం?
X

బాలీవుడ్ సీనియ‌ర్ హీరో గోవిందా న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు. ఒడిశా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) సుమారు రూ. 1000 కోట్లతో కూడిన పాన్-ఇండియా పోంజీ స్కామ్ దర్యాప్తుతో అతడి సంబంధాల‌పై ప్రశ్నించాలని భావిస్తోంది. సోలార్ టెక్నో అలయన్స్ (STA-టోకెన్)కి ఆపాదించబడిన ఈ మోసపూరిత పథకం, క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ ఎంటర్‌ప్రైజ్ పేరుతో నిర్వహిస్తున్నారు. ఇది భారతదేశం అంతటా ప్ర‌జ‌ల్ని మోసం చేసే ప‌థ‌కం అని పోలీసులు విశ్లేషించారు.

కంపెనీ కార్యకలాపాలను సీనియ‌ర్ హీరో గోవింద ఆమోదించారని, వివ‌రాలు బ‌హిర్గ‌తం చేయ‌డానికి అత‌డిని పిలుస్తార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. EOW ఇన్‌స్పెక్టర్ జనరల్ JN పంకజ్ జూలైలో గోవాలో జరిగిన STA కి చెందిన‌ విలాసవంతమైన కార్యక్రమంలో పాల్గొని వీడియోల ద్వారా కంపెనీని ప్రమోట్ చేసిన గోవిందాను ప్రశ్నించడానికి ఒక బృందాన్ని ముంబైకి పంపార‌ని పేర్కొన్నారు.

ముఖ్యంగా, ఈ కేసులో గోవిందా అనుమానితుడు లేదా నిందితుడు కాదని ఈఓడబ్ల్యూ అధికారి స్పష్టం చేశారు. కేవలం కంపెనీ ఎండార్సర్‌గా గోవింద ప్రమేయం ఉందనే నిర్ణయాన్ని బట్టి అతడిని కేసులో సాక్షిగా పరిగణించవచ్చు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురి అరెస్టులు జరగడం గమనార్హం. భారతదేశంలో, ఒడిశాలో కంపెనీకి నాయకత్వం వహించిన గుర్తేజ్ సింగ్ సిద్ధూ, నిరోద్ దాస్ ఈ ఏడాది ప్రారంభంలో పట్టుబడ్డారు.

భువనేశ్వర్‌కు చెందిన పెట్టుబడి సలహాదారు రత్నాకర్ పాలై ఆగస్టులో అరెస్టయ్యారు. కంపెనీ చీఫ్, హంగేరియన్ దేశస్థుడు డేవిడ్ గెజ్, రాజస్థాన్‌కు చెందిన మరో ముగ్గురు వ్యక్తులకు కూడా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. వారంతా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

ఖండించిన మేనేజ‌ర్: అయితే గోవిందా మేనేజర్ శశి సిన్హా పై వార్త‌ల్ని ఖండించారు. ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఈ కేసుతో గొవిందాకు ఎటువంటి సంబంధం లేదని ఖండించారు. ప్ర‌ముఖ జాతీయ మీడియాతో మాట్లాడుతూ గోవిందా ఒక ఈవెంట్ కోసం ఒక ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నార‌ని కంపెనీ వ్యాపారం లేదా బ్రాండింగ్‌లో ఎటువంటి ప్రమేయం లేదని సిన్హా వాదించారు. మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలను అసంపూర్తిగా, తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయ‌ని సిన్హా అభివర్ణించారు.