Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ల‌లో మిగిలింది చిరంజీవి, బాల‌య్యే!

సీనియ‌ర్ హీరోలంతా మళ్లీ రేసులో దూసుకుపోతున్నారు. వారి త‌ర్వాత త‌రం హీరోల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా వారి సినిమాలు బాక్సాఫీస్ ను వ‌సూళ్ల‌తో షేక్ చేస్తున్నాయి.

By:  Srikanth Kontham   |   17 Feb 2026 4:00 AM IST
సీనియ‌ర్ల‌లో మిగిలింది చిరంజీవి, బాల‌య్యే!
X

సీనియ‌ర్ హీరోలంతా మళ్లీ రేసులో దూసుకుపోతున్నారు. వారి త‌ర్వాత త‌రం హీరోల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా వారి సినిమాలు బాక్సాఫీస్ ను వ‌సూళ్ల‌తో షేక్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేష్ ర‌ప్ఫాడించేసారు. ఇద్ద‌రు 300 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయారు. అప్ కమింగ్ చిత్రాల‌తో బాల‌య్య‌, నాగార్జున కూడా ఆ క్ల‌బ్ లో చేరిపోతార‌ని అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా సీనియ‌ర్ హీరోలు న‌వ‌త‌రం హీరోల‌కు ధీటుగా రాణిస్తున్నారు. అలాగే ఓటీటీలో కూడా ఇప్ప‌టికే ఇద్ద‌రు సీనియ‌ర్లు ఎంట్రీ ఇచ్చేసారు. వారిలో ఒక‌రు విక్ట‌రీ వెంక‌టేష్ `రానా నాయుడు`తో లాంచ్ అయ్యారు.

మ‌రిన్ని సిరీస్ ల్లో న‌టించ‌డానికి వెంక‌టేష్ సిద్దంగా ఉన్నారు. ఆయ‌న హీరోగా న‌టించిన సినిమాలు కూడా ఓటీటీలో నేరుగా రిలీజ్ అయ్యాయి. `దృశ్యం 2`, `నార‌ప్ప` ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలే. వెంకీ ఓటీటీలోకి వ‌చ్చారంటే బ్యాకెండ్ లో సురేష్ బాబు ఎంతో వ‌ర్క్ చేసారు అన్న‌ది కాద‌న‌లేని నిజం. ఆయ‌న సినిమా ప్యూచ‌ర్ ఊహించ‌గ‌ల దిగ్గ‌జం. అలా అన్న‌య్య స‌హ‌కారం ఉండ‌టంతో? టెక్నాల‌జీని అందిపుచ్చుకోవ‌డం వెంకీకి సుల‌భ‌మైంది. త్వ‌ర‌లో కింగ్ నాగార్జున కూడా ఓటీటీలో లాంచ్ అవ్వ‌డానికి రెడీగా ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లు ఓటీటీ సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

బిగ్ బాస్ రియాల్టీ షో హోస్ట్ గా త‌నదైన ముద్ర వేసేసారు. దీంతో వెబ్ సిరీస్ లాంచింగ్ కి ఇదే స‌రైన స‌మ‌యంగా భావిస్తున్నారు. ఇదే ఏడాది కింగ్ వెబ్ సిరీస్ ల్లోకి ఎంట‌ర్ అయ్యే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. ఇక సీనియ‌ర్ల‌లో మిగిలింది చిరంజీవి..బాల‌య్య మాత్ర‌మే. వీరు కూడా ఓటీటీ సిరీస్ ల విష‌యంలో సానుకూలంగా స్పందించిన సంద‌ర్భాలెన్నో. చిరంజీవి `కుభేర` స‌క్సెస్ మీట్ స‌మ‌యంలోనే అవ‌స‌రం వ‌స్తే తాను ఎంట‌ర్ అవుతానంటూ ప్ర‌క‌టించారు. దానికి సంబంధించి మాన‌సికంగా తాను అప్ప‌టి నుంచే సిద్ద‌ప‌డుతున్న‌ట్లు తెలిపారు.

ఫిట్ నెస్ విష‌యాల్లో స్పూర్తినింపిన నాగార్జున స్పూర్తితోనే అది జ‌రిగే అవ‌కాశం ఉంటుందేమో అనేసారు.

బాల‌య్య కూడా `ఆహా` టాక్ తో షో ఓటీటీ వ‌ర‌ల్డ్ లోకి హోస్ట్ గా ఎంట‌ర్ అయ్యారు. సిరీస్ లు మాత్ర‌మే ఇంకా చేయ‌లేదు. అందుకు బాల‌య్య ఎంత మాత్రం వ్య‌తిరేకం కాదు. స‌రైన క‌థ కుదిరితే? బాల‌య్య సై అంటూ ముందుకొచ్చేస్తారు. క‌ళామాత‌ల్లి ముద్దు బిడ్డ‌గా ఏ వేదిక‌పైనైనా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డ‌మే విధిగా భావిస్తారు అందుకు కేవ‌లం వెండి తెర మాత్ర‌మే ఉండాలా? అన్న‌ది బాల‌య్య మ‌న‌సులో మాట‌. న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు సినిమాల‌కంటే ఓటీటీ సిరీస్ ల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. త‌క్కువ ఖ‌ర్చులో మంచి ఫ‌లితాలు సాధించ‌డానికి ఓటీటీ సిరీస్ లే ఉత్త‌మంగా భావిస్తున్నారు. పెరిగిన నిర్మాణ వ్య‌యంతో హీరోలు కూడా ముందుకొస్తే నిర్మాత‌కు భారం త‌గ్గుతుంది.