'లీడర్ 2' స్క్రిప్ట్ రెడీగా ఉందట కానీ..!
క్రేజీ బ్లాక్ బస్టర్లకు సీక్వెల్స్ రూపొందుతున్న నేపథ్యంలో `లీడర్` సీక్వెల్ ఎప్పుడు అనే చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 19 Jun 2025 6:00 AM ISTక్రేజీ బ్లాక్ బస్టర్లకు సీక్వెల్స్ రూపొందుతున్న నేపథ్యంలో `లీడర్` సీక్వెల్ ఎప్పుడు అనే చర్చ జరుగుతోంది. రానాని హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మక ఏవీఎం సంస్థ నిర్మించిన మూవీ `లీడర్`. రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్ హీరోయిన్‌లుగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సమకాలీన రాజకీయాలు ఎలా ఉన్నాయి?.. సామాన్యుడికి ఎంత మేలు చేస్తున్నాయి? రాజకీయ చదరంగంలో ఎవరు ఎవరుగా మారుతున్నారు? పరిస్థితులకు తలొగ్గి ఎలాంటి తప్పులు చేస్తున్నారు?
అనే ఆలోచింపజేసే కథ, కథనాలతో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీ 2010లో విడుదలై అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమా విడుదలై పదిహేనేళ్లకు పైనే అవుతున్నా దీని సీక్వెల్‌పై శేఖర్ కమ్ముల స్పందించలేదు. చాలా వరకు దీనికి సీక్వెల్ చేయాలని ప్రేక్షకుల నుంచి డిమాండ్ వచ్చింది. అయినా సరే శేఖర్ కమ్ముల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని ప్రకటించిన సందర్భంలో `లీడర్ 2`ని ఆయనతో చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అది వార్తల వరకే పరిమితం కావడంతో మళ్లీ ఇన్ని రోజులకు `లీడర్` సీక్వెల్ ఎప్పుడుంటుందనే వార్తలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ ప్రాజెక్ట్‌పై తాజాగాఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనుష్‌తో చేసిన `కుబేర` రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆయన `లీడర్` సీక్వెల్ గురించి స్పందించారు.
`లీడర్ 2`కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ రెడీగా ఉంది. అయితే ప్రస్తుత రాజకీయ సినారియోకు ఆ కథ యాప్ట్ అవుతుందా? అనే అనుమానం నాలో ఉంది. ప్రస్తుతం రాజకీయ నాయకులని మించి ప్రజలు మారారు. ఇలాంటి పరిస్థితుల్లో `లీడర్ 2` కథ ఫిట్ అవుతుందా? అనే అనుమానం ఉంది` అంటూ అసలు విషయం బయటపెట్టారు. అంటే `లీడర్` సీక్వెల్ కథ సిద్ధంగానే ఉన్నా దాన్ని నేటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, ఆ తరేవాతే సీక్వెల్ చేస్తానని ఇండైరెక్ట్‌గా శేఖర్ కమ్ముల హింట్ ఇవ్వడం గమనార్హం.
