నా స్థాయికి అదే ఎక్కువ
టాలీవుడ్ లో మంచి అభిరుచి ఉన్న డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. ఆయన సినిమాలకు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
By: Tupaki Desk | 19 Jun 2025 9:59 AM ISTటాలీవుడ్ లో మంచి అభిరుచి ఉన్న డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. ఆయన సినిమాలకు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సెన్సిటివ్ అంశాలతో సినిమాలు తీసే శేఖర్ కమ్ముల ఇప్పుడు తన రూటు మార్చి తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నాగార్జున కీలక పాత్రలో కుబేర అనే సినిమా చేశాడు. ఈ సినిమా జూన్ 20న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా మీడియా ముందుకొస్తున్న శేఖర్ కమ్ముల తన పర్సనల్ విషయాలతో పాటూ తన కెరీర్ గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే పాతికేళ్లు అయిపోయిందా అని ఆశ్చర్యంగా ఉంటుందని, ఈ పాతికేళ్ల జర్నీ ఎంతో తృప్తినిచ్చిందని, కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ తానంతే ఉన్నానని శేఖర్ కమ్ముల తెలిపారు.
తన లానే తన సినిమాలు కూడా సింపుల్ గా ఉంటాయని, తన ఆర్థిక పరిస్థితి, తన బ్యాక్ గ్రౌండ్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తానని, ఒకప్పుడు ఫ్రెండ్స్ అందరి దగ్గర డబ్బులు తీసుకుని మరీ సినిమాలు తీశానని, ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేనని, అదృష్టం కొద్దీ ఇప్పటి వరకు ఎప్పుడూ ఎదురుదెబ్బలు తగల్లేదని శేఖర్ కమ్ముల చెప్పారు.
తాను ఈ స్థాయికి రావడానికి కారణం ఆడియన్స్ చూపించిన ప్రేమేనని, అది గుర్తొచ్చినప్పుడల్లా ఎమోషనల్ అవుతుంటానని, ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లైనా 10 సినిమాలే చేశారా అని కొందరంటుంటారని, కానీ తనకు అదే ఎక్కువ అని శేఖర్ కమ్ముల చెప్పారు. తాను ఎవరిపై ఎక్కువ అంచనాలను పెట్టుకోనని, ఎవరి నుంచీ ఏదీ ఆశించనని అందుకే సినిమాల పరంగా ఎప్పుడూ బాధ పడలేదని అన్నారు. సినిమా లాభాల్లో ఎప్పుడూ లాభాలు అడగలేదని చెప్పిన శేఖర్ కేవలం రెమ్యూనరేషన్ ను మాత్రమే తీసుకోవడం వల్ల చాలా నష్టపోయానని అయినప్పటికీ తనకెలాంటి బాధ లేదని, అన్నింటికంటే ముఖ్యమైన ఆడియన్స్ ఆదరణ ఉన్నప్పుడు ఇంకేం కావాలి అనిపిస్తుంటుందని ఆయన అన్నారు.
