'సీతా పయనం' ప్రీరిలీజ్: ముగ్గురు రియల్ హీరోలకు సన్మానం
అందుకే ఈ ముగ్గురు రియల్ హీరోలకు ఒక్కొక్కరికి 1 లక్ష చొప్పున చెక్కును సేవాకార్యక్రమాల నిమిత్తం ఈ వేదికపై నిర్మాతలు అందించారు.
By: Sivaji Kontham | 10 Feb 2026 10:40 PM ISTఒకరు 70 ఎకరాల సొంత భూమిని ప్రకృతికి అంకితమిచ్చి అడవిగా మార్చిన అందులో జీవాలకు జీవం నింపిన మహనీయుడు.. ఒకరు తన భార్యతో కలిసి అడవిలో గిరిజనులకు సేవలందించిన గొప్ప వ్యక్తి.. మరొకరు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని కాపాడటానికి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టే సాహసి.. ఆ ముగ్గురు రియల్ హీరోలకు ఒకే వేదికపై సన్మానం. అది కూడా ఒక సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో సన్మానం చేయాలనే ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండగలమా?
నిజానికి చాలా ప్రీరిలీజ్ వేడుకలు జరుగుతుంటాయి. కానీ ఇలాంటి ప్రయత్నం చేయాలనే ఉధాత్తమైన ఆదర్శవంతమైన ఆలోచన ఎందరికి వస్తుంది? ఇలాంటివి చూసినప్పుడు నిజంగా స్ఫూర్తిని నింపుతాయి. రియల్లీ హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేం. ఆ నిర్మాత, ఆ హీరో లేదా దర్శకుడు వీళ్లందరి మనసులోంచి పుట్టుకొచ్చిన ఒక గొప్ప ఆలోచన హృదయాలను తాకింది.
తన 70 ఎకరాల భూమిని చెట్లు నాటి అడవిగా మార్చిన దుశ్చర్ల సత్యనారాయణ, ఆ అడవిలో పండే పండ్లకు కేవలం పక్షులు , మూగ జీవాలకే అంకితమిచ్చారు.. ఆయన ప్రభుత్వ అవార్డులు, రివార్డులు అందుకున్నారు..
అడవులలో గిరిజనులకు సేవలందిస్తూ రియల్ హీరోలు అయ్యారు డాక్టర్ ప్రకాష్ ఆప్టే- మందాకిని ఆప్టే దంపతులు. 600 ఎకరాల జమీందార్ కూతురు మందాకిని ఆప్టే... ప్రేమికుడి కోసం అన్నిటినీ వదులుకుని ఆయన వెంటే వచ్చేసారు.. పెళ్లి తర్వాత 52 ఏళ్ల ప్రేమానుబంధం.. ఇప్పుడు ఈ వేదికపై కలిసింది.
ఇక ఇదే వేదికపై ట్యాంక్ బండ్ శివ గురించి ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఆయన చాలా మంది జీవితాలను కాపాడారు..తల్లి, పిల్ల, అమ్మాయి అబ్బాయి.. ఎందరో.. ట్యాంక్ బండ్ పై నుంచి దూకిన వారిని కాపాడి ప్రాణ భిక్ష పెట్టారు శివ. ఆ నీళ్లలోకి దూకడమే గ్రేట్.. అది ప్రాణాపాయం అని తెలిసీ అతడు అందులోకి దూకి కాపాడాడు.
అందుకే ఈ ముగ్గురు రియల్ హీరోలకు ఒక్కొక్కరికి 1 లక్ష చొప్పున చెక్కును సేవాకార్యక్రమాల నిమిత్తం ఈ వేదికపై నిర్మాతలు అందించారు. దర్శకుడు అర్జున్ - బ్రహ్మానందం జోడీ ఆ ముగ్గురిని పుష్పగుచ్ఛాలతో ఆహ్వానించి, శాలువాలు కప్పి సన్మానించడం గ్రేట్. ఇది చాలా ప్రత్యేకమైన ప్రీరిలీజ్ వేడుక.
శ్రీరామ ఫిలింస్ పతాకంపై రూపొందిన `సీతా పయనం` ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో నిరంజన్ - ఐశ్వర్య నాయకానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అర్జున్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ ఫిలింస్ పతాకంపై రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ సినిమా ఒక భావోద్వేగపూరితమైన ప్రయాణం అని చిత్ర బృందం పేర్కొంది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా కేవలం గ్లామర్‌కే ప్రాధాన్యత ఇవ్వకుండా, సమాజంలో గొప్ప పనులు చేస్తున్న ప్రకాష్ ఆమ్టే, దుశ్చర్ల సత్యనారాయణ, ట్యాంక్ బండ్ శివ వంటి రియల్ హీరోలను ఆహ్వానించి వారిని సన్మానించారు.
