సీత మా ఆవిడ పేరు.. సాయి మాధవ్ బుర్రా ఎమోషనల్
నేటి కాలంలో ఓటీటీ ట్రెండ్ నడుస్తున్నప్పటికీ, ఈ సినిమాలోని అనుభూతిని పొందాలంటే ఓటీటీలో కాదు, థియేటర్లకు వచ్చి సినిమా చూడండి! అని ఆయన ప్రేక్షకులను కోరారు.
By: Sivaji Kontham | 10 Feb 2026 10:53 PM ISTయాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహించిన `సీతా పయనం` ప్రీ-రిలీజ్ వేడుకలో మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా చేసిన ప్రసంగం అత్యంత భావోద్వేగంగా సాగింది. రచయిత సాయి మాధవ్ ఈ వేదికపై కేవలం సినిమా గురించే కాకుండా, మానవత్వం, సమాజం విషయంలో బాధ్యత గురించి ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ వేదిక మీదకు రియల్ హీరోలను పిలిచి సన్మానించడం చూసి చలించిపోయారు. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ఒక సంస్కృతిని, విలువలను కాపాడేదిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
సాయి మాధవ్ బుర్రా యాక్షన్ కింగ్ అర్జున్ గురించి మాట్లాడుతూ, ఆయన కేవలం వెండితెరపైనే కాదు.. నిజజీవితంలో కూడా ఒక `జెంటిల్‌మెన్` అని కొనియాడారు. అర్జున్ క్రమశిక్షణ, ఆయన ఎంచుకునే కథలు సమాజానికి ఏదో ఒక సందేశాన్ని ఇస్తాయని చెప్పారు. ఈ సినిమాలో అర్జున్ గారి పాత్ర చాలా హుందాగా, శక్తివంతంగా ఉంటుందని ఆయన ప్రశంసించారు. ఈ చిత్రంలో సంగీతం, సాహిత్యం గురించి సాయిమాధవ్ బుర్రా ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిత్రంలోని మెలోడీ సాంగ్స్ తన మనసును తాకాయని, ముఖ్యంగా మట్టి వాసనతో కూడిన సాహిత్యం ఉన్న పాటలు తనకు బాగా నచ్చాయని చెప్పారు. ఈ తరం ప్రేక్షకులకు ఈ పాటలు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
బ్రహ్మానందం గురించి సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. ``బ్రహ్మానందం గారిని పక్కన పెట్టి 80 ఏళ్ల తెలుగు సినిమాని మనం ఊహించగలమా?. ఆయన తెలుగు సినిమా చరిత్రలో ఒక అవిభాజ్యమైన నటుడు. ఈ సినిమాలో ఆయన ఉండటం చిత్రానికి పెద్ద అస్సెట్`` అని కొనియాడారు. నేను ఈ సినిమా చూశాను.. ఇది కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని సాయి మాధవ్ నమ్మకంగా చెప్పారు. యాక్షన్ కింగ్ అర్జున్ గారి కుమార్తె ఐశ్వర్య ఈ చిత్రంలో అద్భుతంగా నటించిందని, తన నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ప్రశంసించారు. హీరో నిరంజన్ తన పాత్రలో చాలా ఒదిగిపోయి చేశారని, అలాగే సీనియర్ నటుడు సత్యరాజ్ గారు తన అనుభవంతో ఈ చిత్రానికి ప్రాణం పోశారని పేర్కొన్నారు.
సీతా పయనం మా ఆవిడ కథే.. తన పేరు సీత. ఈ కథ రాస్తున్నప్పుడు నా భార్య వచ్చి చూసేది.. ఆ సమయంలో కలిగిన భావోద్వేగాలే ఈ స్క్రిప్ట్‌లో ఉన్నాయని చెప్పారు. ఇది తన మనసుకు చాలా దగ్గరైన సినిమా అని ఆయన ఎమోషనల్ అయ్యారు.
నేటి కాలంలో ఓటీటీ ట్రెండ్ నడుస్తున్నప్పటికీ, ఈ సినిమాలోని అనుభూతిని పొందాలంటే ఓటీటీలో కాదు, థియేటర్లకు వచ్చి సినిమా చూడండి! అని ఆయన ప్రేక్షకులను కోరారు. సినిమాలోని విజువల్స్, ఎమోషన్స్ థియేటర్లోనే బాగా పండుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
సాయి మాధవ్ బుర్రా సీతా పయనం చిత్రానికి మాటలు అందించారు. ఆయన కలం నుండి వచ్చిన భావోద్వేగపూరితమైన సంభాషణలు ఈ సినిమాకు ప్రధాన బలం కానున్నాయి. సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలకు ఆయన స్క్రిప్ట్ పరంగా కూడా తన సహకారాన్ని అందించినట్లు సమాచారం.
శ్రీరామ ఫిలింస్ పతాకంపై రూపొందిన `సీతా పయనం` ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో నిరంజన్ - ఐశ్వర్య నాయకానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అర్జున్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ ఫిలింస్ పతాకంపై రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ సినిమా ఒక భావోద్వేగపూరితమైన ప్రయాణం అని చిత్ర బృందం పేర్కొంది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా కేవలం గ్లామర్‌కే ప్రాధాన్యత ఇవ్వకుండా, సమాజంలో గొప్ప పనులు చేస్తున్న ప్రకాష్ ఆమ్టే, దుశ్చర్ల సత్యనారాయణ, ట్యాంక్ బండ్ శివ వంటి రియల్ హీరోలను ఆహ్వానించి వారిని సన్మానించారు.
