Begin typing your search above and press return to search.

సీమా హైదర్‌ కు సినిమా ఛాన్స్‌... అందులో ట్విస్ట్ ఇదే!

ఉదయ్‌ పుర్‌ టైలర్‌ కన్హయ్య లాల్‌ హత్య ఘటనపై ఏ టైలర్‌ మర్డర్‌ స్టోరీ పేరిట ఓ చిత్రాన్ని జానీ ఫైర్‌ ఫాక్స్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ త్వరలో తెరకెక్కించనుంది

By:  Tupaki Desk   |   3 Aug 2023 10:04 AM GMT
సీమా హైదర్‌ కు సినిమా ఛాన్స్‌... అందులో ట్విస్ట్ ఇదే!
X

పబ్‌ జీ లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్ నుంచి భారత్‌ లోకి అక్రమ మార్గంలో అడుగుపెట్టిన సీమా హైదర్‌ గురించి ఇప్పుడు పెద్దగా పరిచయం అవసరం లేదనే అనుకోవాలి. గతకొంతకాలంగా జాతీయమీడియా, ప్రాంతీయమీడియా, సోషల్ మీడియా అనే తారతమ్యాలేమీ లేకుండా... ఎక్కడ చూసినా ఈమె గురించిన చర్చే జరిగిందన్నా అతిశయోక్తి కాదు! ఈ సమయంలో ఈమెకు సినిమా ఛాన్స్ వచ్చింది!

అవును... ఫబ్ జీ లో పరిచయమైన భారతీయ యువకుడి కోసం పాకిస్థాన్ లో భర్తకు విడాకులు ఇచ్చి, తన వాటాగా వచ్చిన ఇంటిని అమ్ముకుని, నలుగురు పిల్లలను తీసుకుని.. ఢిల్లీ వయా దుబాయ్ - నేపాల్ వచ్చిన సీమా హైదర్ కి సినిమా ఛాన్స్‌ కొట్టేసింది.

ఉదయ్‌ పుర్‌ టైలర్‌ కన్హయ్య లాల్‌ హత్య ఘటనపై "ఏ టైలర్‌ మర్డర్‌ స్టోరీ" పేరిట ఓ చిత్రాన్ని జానీ ఫైర్‌ ఫాక్స్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ త్వరలో తెరకెక్కించనుంది. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం సీమాను సంప్రదించారు. ఈ మేరకు చిత్ర దర్శకులు జయంత్‌ సిన్హా, భరత్‌ సింగ్‌ లు ఆమెకు ఆడిషన్‌ నిర్వహించారని తెలుస్తోంది.

అయితే పాకిస్థాన్ నుంచి ఢిల్లీ వచ్చిన సీమాను పోలీస్ లు అరెస్ట్ చేసి విచారించిన సంగతి తెలిసిందే. ఈమె పాకిస్తాన్ ఏజెంటా.. ఐ.ఎస్.ఐ. మనిషా, పాక్ ఆర్మీ కి సంబంధించిన మహిళా... అంటూ రకరకాల కథనాలు తెరపైకి వచ్చాయి. అయితే... తాజాగా "ఏ టైలర్‌ మర్డర్‌ స్టోరీ" సినిమాలో ఆమెను "రా" ఏజెంట్ పాత్ర కోసం సంప్రదించడం గమనార్హం.

మరోపక్క సచిన్‌ మీనాను వివాహం చేసుకున్న సీమా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ లోని గ్రేటర్‌ నోయిడాలో నివాసముంటున్నారు. కొత్త ఇంటికి మారిన అనంతరం వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈమధ్య మీడియాకు తెలిపారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరిని సినీ దర్శకులు సంప్రదించినట్లు సమాచారం. కాగా.. ప్రస్తుతం ఆమె బెయిల్‌ పై విడుదలై ఉంది.