500 ఎకరాలు బంగ్లా అమ్ముకున్న కమెడియన్?
సత్యన్ ఒక భూస్వామి వారసుడు. కోయంబత్తూరు జిల్లాలోని ఒక ప్రముఖ నగరం మాధంపట్టి స్వస్థలం. అతడికి వారసత్వ సంపదగా వందల ఎకరాల ఆస్తి ఉంది.
By: Tupaki Desk | 4 July 2025 8:00 AM ISTవందల ఎకరాల ఆస్తులు.. తాత ముత్తాతల వారసత్వంగా వచ్చిన భూములు.. ఐదెకరాల్లో సొంత బంగ్లా. సకల సౌకర్యాలు. ఒక చిన్న సామ్రాజ్యాన్ని నడిపించేది ఆ కటుంబం. కానీ ఎంత పెద్ద కుటుంబం అయినా కాలంతో పాటే విచ్ఛిన్నమైంది. ఆస్తులన్నీ గాలికి కొట్టుకుపోయాయి. అయితే ఆ కుటుంబ పెద్దకు ఉన్న సినిమా పిచ్చి కారణంగా, మొత్తం ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా కరిగిపోయాయి. ఇప్పుడు 500 ఎకరాలు లేవు. సొంత బంగ్లా లేదు. పూర్తిగా మకాం చెన్నైకి మారిపోయింది. అక్కడే కోలీవుడ్ లో సినీఛాన్సుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి ఇప్పటికి సీనియర్ కమెడియన్ గా నిలదొక్కుకున్నాడు. ఇంతకీ అతడు ఎవరు? అంటే....
తమిళ హాస్యనటుడు సత్యన్. శంకర్ తెరకెక్కించిన స్నేహితుడు సినిమాలో విజయ్, జీవాలతో పాటు ఒక స్నేహితుడిగా నటించాడు. స్నేహితుడు, తుపాకి చిత్రాల్లో అతడి పాత్రలకు మంచి గుర్తింపు దక్కింది. ఒక ప్రత్యేకమైన యాస, విరుపు అతడి డైలాగ్ డెలివరీలో ప్రత్యేకత. సహజసిద్ధమైన హాస్యంతో కడుపుబ్బా నవ్వించగల ప్రతిభావంతుడు. అందుకే తమిళంలో ఇప్పటికే 70 పైగా చిత్రాల్లో నటించాడు. నేడు కోలీవుడ్ ప్రముఖ హాస్య నటుల్లో అతడు ఒకడు. అయితే సత్యన్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే ఎవరైనా షాక్ తింటారు.
సత్యన్ ఒక భూస్వామి వారసుడు. కోయంబత్తూరు జిల్లాలోని ఒక ప్రముఖ నగరం మాధంపట్టి స్వస్థలం. అతడికి వారసత్వ సంపదగా వందల ఎకరాల ఆస్తి ఉంది. ఐదెకరాల విస్తీర్ణంలో పెద్ద బంగ్లా కూడా అతడికి ఉంది. అయితే మాధంపట్టిలోని ఆస్తులన్నిటినీ అమ్ముకోవాల్సి వచ్చింది. తొలుత సత్యన్ ని హీరోని చేయాలని భావించిన అతడి తండ్రి శివకుమార్ ఓ సినిమాని కూడా నిర్మించాడు. కానీ అది ఫ్లాపవ్వడంతో అంతా లాసైంది. సత్యన్ కొన్నేళ్ల క్రితం మాధం పట్టిలోని భవంతిని కూడా అమ్మేసి చెన్నైకి షిఫ్టయిపోయాడు. ఇక వీరి కుటుంబానికి సత్యరాజ్ బంధువు. సత్యరాజ్ నటుడిగా నిలదొక్కుకోవడానికి ఆర్థిక సాయం చేసింది సత్యన్ తండ్రి శివకుమార్. సత్యన్ తండ్రి సినిమాల్లో పెట్టుబడులు పెట్టి పెద్ద దెబ్బ తిన్నాడు. ఉన్న ఆస్తులన్నీ అమ్మడానికి కారకుడయ్యాడు. ప్రస్తుతం సత్యన్ ఆస్తులన్నిటినీ అమ్మేయడంతో అసలు తన ఊరివైపే కన్నెత్తి చూడటం లేదట. ఇక గ్లామర్ ప్రపంచంలో మాత్రం అతడు నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు పోగొట్టుకున్నదంతా రాబట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నాడట.
